రాత పరీక్ష పాసైతే చాలు!  

13 Aug, 2019 05:10 IST|Sakshi

వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టు దక్కే చాన్స్‌ 

పోస్టులు 9,886.. అభ్యర్థులు 6,265 మంది 

ఇతర ఉద్యోగాలకు మాత్రం పోటీ తీవ్రం 

1,26,728 ‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షకు 21,69,719 మంది అర్హత   

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలు, 1.26 లక్షలకుపైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్‌మెన్‌ ఉద్యోగాలు వెరసి రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గత జూలై 26వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రితో ముగియగా గడువు ముగిసే సమయానికి 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్ష మందికి పైగా దరఖాస్తు ఫీజు చెల్లించని కారణంగా 21,69,719 మందే రాతపరీక్షకు అర్హత పొందారు. 

దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం!
ఒకవైపు ‘సచివాలయ’ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టు అభ్యర్థులు మాత్రం రాత పరీక్షలో కనీస మార్కులు సాధిస్తే చాలు కొలువు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకోవటమే దీనికి కారణం. గ్రామ సచివాలయాల్లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మిగిలిన 18 రకాల ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా సరాసరిన 35 మంది పోటీ పడుతున్నారు.

సాధారణ డిగ్రీ ఉద్యోగాలకు భారీ పోటీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ –1లో పేర్కొన్న  పంచాయితీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌  అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ లాంటి నాలుగు రకాల ఉద్యోగాలకు సాధారణ డిగ్రీని కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 12,54,034 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 

మరిన్ని వార్తలు