ప్రయాణం.. నరకప్రాయం

23 Jul, 2018 11:01 IST|Sakshi
గోపాలపురం కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు సమీపంలో పడిన గోతులు

గోపాలపురం : దేవరపల్లి–తల్లాడ రహదారి గోతులమయంగా మారింది. భారీ గోతులతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. హైదరాబాద్‌కు దగ్గర మార్గం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే ఈ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత తూట్లు పడింది. మోకాలు లోతులో గోతులు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఒళ్లు హూనం అవుతోందని వాపోతున్నారు. మరోవైపు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని యజమానులు వాపోతున్నారు. ముఖ్యంగా గోపాలపురం నుంచి కొయ్యలగూడెం మధ్య రహదారి బాగా పాడైంది. గోపాలపురం వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కరిచర్లగూడెం సమీపంలోని ఓంకార్‌ ఫెర్టిలైజర్‌ వద్ద కూడా భారీగోతులు పడ్డాయి. గతంలో ఈ రోడ్డు రాష్ట్రీయ రహదారిగా ఉండేది. ఇటీవల జాతీయ రహదారిగా మార్చారు. దీంతో ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఈ రోడ్డు నిర్వహణను పట్టించుకోవడం లేదు. అటు జాతీయ రహదారి అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. లారీలు గోతుల్లో పడి రిపేర్లు చేయడానికి రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. సంబంధిత అధికారులు, నిత్యం ప్రయాణించే ప్రజాప్రతి«నిధులకు రోడ్డుపై ఉన్న గోతులు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు