కోళ్లుకోలేని దెబ్బ

16 Oct, 2013 04:24 IST|Sakshi

భువనగిరి, న్యూస్‌లైన్: పౌల్ట్రీ రైతు నష్టాల బాట పట్టాడు. ఇటీవల కాలంలో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో వారు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. బ్రాయిలర్ చికెన్ ధర గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. కొత్తగా పౌల్ట్రీలు ఏర్పాటు చేసిన వారు నష్టాలను తట్టుకోలేక దివాలా తీస్తున్నారు. అనేక పౌల్ట్రీలు మూతపడే దశకు చేరుకున్నాయి.
 
 ఇటీవల కాలంలో పౌల్ట్రీల్లో కోళ్ల ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గాయి. ఆ రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమలు పెరగడంతో పాటు ఉత్పత్తి కూడా బాగా పెరగడంతో వారు ఇక్కడ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ఇక్కడి కోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది.
 
 జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క భువనగిరి డివిజన్‌లోనే రెండు వేలకు పైగా కోళ్లఫారాలు ఉన్నాయి. వాటిపై  సుమారు మూడువేల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 10వేల మంది పరోక్షంగా ఈ పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడ్డారు. ఈ సీజన్‌లో కోటికి పైగా కోళ్లను జిల్లా వ్యాప్తంగా పెంచుతున్నారు. ఒక్కో కోడిపిల్లను 23 రూపాయల నుంచి 26 రూపాయల వరకు కొనుగోలు చేస్తారు. 45రోజుల్లో కోడి రెండుకిలోల వరకు బరువు పెరుగుతోంది. ఇందుకోసం దాణా, ఇతర పెట్టుబడులతో కలపి 100 రూపాయల ఖర్చు అవుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌గా రైతుకు కిలో చికెన్‌ను 50 రూపాయలే గిట్టుబాటు అవుతోంది.
 
 కొత్తగా వచ్చిన వారికి నష్టాల బాట
 పౌల్ట్రీలోకి కొత్తగా వచ్చిన వారికి నష్టాల బాట తప్పడం లేదు. రెండు సంవత్సరాల క్రితం మంచి లాభాలను చూసిన రైతుకు ఈ సారి ఆ పరిస్థితి లేదు. లాభాలు వస్తున్నా యి కదా అని మార్కెట్‌లోకి వచ్చిన పౌల్ట్రీ రైతులతో ఉత్పత్తి గణనీయంగా పెరిగిందే కానీ పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో పలువురు నష్టాలను భరించలేక అతి తక్కువ ధరకు ఆత్మకూర్ ఎం మండలంలో పౌల్ట్రీని అమ్ముకున్నారు. ఇల్లా జిల్లాలో పలు రైతులు నష్టాలను తట్టుకోలేకపోతున్నారు. ఇందులో స్థిరపడిన వారు మాత్రం ఏలాగోలాగు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
 
 పెరిగిన ఉత్పత్తి దెబ్బతీసింది
 పెరిగిన కోళ్ల ఉత్పత్తితో కిలో చికెన్ రేటు గణనీయంగా పడిపోయింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఈ సీజన్‌లో కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గతంలో మాదిరిగా పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా గిట్టుబాటు ధర రావడం లేదు.    - పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, భువనగిరి
 

>
మరిన్ని వార్తలు