హ్యాట్సాఫ్..! నాగేంద్రకుమార్!!

25 Dec, 2014 03:31 IST|Sakshi
హ్యాట్సాఫ్..! నాగేంద్రకుమార్!!

ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఐదేళ్ల వయసులో విధి చిన్న చూపు చూడటంతో అతడు రెండు చేతులూ కోల్పోయాడు. తోటి వారంతా ఉత్సాహంగా గంతులు వేస్తుంటే కలత చెందలేదు. తన తలరాత ఇంతేనని నాలుగు గోడల మధ్య కూర్చొని చింతించలేదు. జీవితానికి చదువే ఆయుధమనుకున్నాడు. ఇక్కడా అతనికి చేదు అనుభవమే. ఉన్నత చదువుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. ఇప్పుడు సాయం కోసం చేయి చాస్తున్నాడు. మంచిగా చదివి కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాడు.
 
* ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతం
* రెండు చేతులూ మోచేయి వరకు తొలగింపు
* అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
* ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం
* పేదరికంతో విద్యకు ఆటంకం
* ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు

ఒంగోలు టౌన్ : మేదరమెట్ల మండలం సోమవరప్పాడులో దాట్ల చినకోటయ్య, సుబ్బరత్నం దంపతులకు ఇద్దరు సంతానం. వారు కూలీ నాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు నాగేంద్రకుమార్ ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫలితంగా రెండు చేతులూ మోచేతుల వరకు వైద్యులు తీసేశారు. ఇంటికి పెద్ద కుమారుడు వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రెండు చేతులు లేకున్నా ఆ విద్యార్ధి ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు.

ఇతర విద్యార్థుల మాదిరిగానే అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ వచ్చాడు. ఎలాగోలా గ్రిప్ సాధించుకొని పెన్నూ పుస్తకం పట్టాడు. వేగంగా రాయడం.. వేగంగా పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించాడు. ఇంతలో పదో తరగతికి చేరాడు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై అందరిచేత ‘శభాష్’ అనిపించుకున్నాడు. ఇంటర్‌లో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం మేదరమెట్లలోని శారదా డిగ్రీ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సైకిల్‌ను అవలీలగా తొక్కేయగలడు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాడు.
 
పింఛన్‌తో చదువుకుంటూ..
తల్లిదండ్రులకు నాగేంద్రకుమార్‌ను చదివించడం కష్టంగా మారింది. రెండు చేతులు లేకపోవడంతో ఏమి చదువుతాడులే అని మొదట్లో వారు కూడా కలత చెందారు. చివరకు తమ కుమారుడు చదువులో రాణిస్తుంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు సంపాదించే కూలీ డబ్బులు కుటుంబ అవసరాలకు అంతంత మాత్రంగా ఉండటంతో నాగేంద్రకుమార్‌కు పింఛన్ అండగా నిలిచింది.

ప్రతినెలా వచ్చే వికలాంగ పింఛన్‌తో ఒకరిపై ఆధారపడకుండా చదువుకుంటూ ముందంజలో ఉన్నాడు. ఒకవైపు వయసు పెరుగుతుండటం, ఇంకోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పడుతుండటంతో స్వయం ఉపాధి సాధించాలని నాగేంద్రప్రసాద్ మనసులో పడింది. చదువుకుంటూనే ఉపాధి ద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండాలని భావిస్తున్నాడు. నాగేంద్రకుమార్‌ను ఆదుకోవాలనుకునేవారు 90522 06762 నంబర్‌ను సంప్రదించవచ్చు.

>
మరిన్ని వార్తలు