పంచాయతీలకు బకాయిల షాక్‌!

5 Oct, 2017 13:10 IST|Sakshi

సుమారు రూ.4 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు

చెల్లించక తప్పదంటున్న అధికారులు

నిధులు లేక సర్పంచుల అవస్థలు

శ్రీకాకుళం ,పాలకొండ రూరల్‌: పంచాయతీలకు బకాయిల షాక్‌ తగలనుంది. పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుండటంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. నిధులు లేకపోవడంతో వీటిని ఎలా చెల్లించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 2016 నుంచి 2017 ఫిబ్రవరి వరకు సుమారు రూ.56 కోట్ల బకాయిలు పంచాయతీల నుంచి రావాల్సి ఉందని విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు. వీటిపై పలు పంచాయతీలు అప్పట్లో కోర్టులను ఆశ్రయించగా కొంతమేర వెసులుబాటు ఇచ్చిన ఈపీడీసీఎల్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలను వసూలు చేసే పనిమిలో నిమగ్నమైంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 11 వందల పంచాయతీలకు సంబంధించి పెండింగ్‌ బకాయిలు రూ.4కోట్ల పైబడి ఉన్నాయి. ఈ బిల్లులను ఈ నెల 20వ తేదీలో చెల్లించాలని విద్యుత్‌ శాఖ పంచాయతీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని తేల్చిచెప్పటంతో పంచాయతీ అధికారులు డైలమాలో పడ్డారు. పండగల సీజన్‌లో సరఫరా నిలిపివేస్తే పంచాయతీ వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని భావించి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో పంచాయతీ బిల్లులను ప్రభుత్వమే భరించేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాధారణ నిధులతోనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ భారం గ్రామ పంచాయతీలపై పడింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో వార్షిక ఆదాయం తగ్గిపోవటంతో బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీలకు ఒక్క మీటరే ఉండటం, వాడకం పెరిగిన కొద్దీ శ్లాబురేటు పెరగటంతో తెలియకుండానే భారం పెరిగిపోతోంది.  

వేధిస్తున్న నిధుల కొరత..
జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి నిధుల కొరత వేధిస్తోంది. ఉన్న నిధులు స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తుండగా తాజాగా విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో అటు పాలకవర్గాలు, కార్యదర్శులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంచాయతీలకు ఆదాయ వనరులుగా ఉన్న ఇంటిపన్నులు, ఆస్తిపన్నులు, కుళాయి పన్నులు గ్రామస్థాయిలో పేరుకుపోవంటతో పంచాయతీ ఆదాయానికి గండి పడింది.

సీతంపేట సబ్‌డివిజన్‌ పరిధిలో..
ఒక్క సీతంపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో 2017 ఫిబ్రవరికి ముందు ఉన్న బకాయిలిలా ఉన్నాయి.. పాలకొండలో రూ.68 లక్షల 48 వేలు, సీతంపేటలో రూ.142.44 లక్షలు, వీరఘట్టంలో రూ.150.03 లక్షలు, బూర్జలో రూ.28.61 లక్షలు, వంగరలో రూ.76.10 లక్షల  వంతున మొత్తం రూ.4కోట్ల 65 లక్షల 66 వరకు బకాయిలు ఉన్నాయి. 2017 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ ఐదు మండలాలు చెల్లించాల్సిన బకాయిలు రూ.56 లక్షల 12వేలు. ఇప్పటివరకు వసూలైన మొత్తం కేవలం రూ.11 లక్షల 30 కావడంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది బకాయిల వసూలు ఒత్తిడి తెస్తున్నారు.   

మరోసారి సందేశాలు పంపిస్తున్నాం
బకాయిల వసూలుకు కసరత్తు చేస్తున్నాం. జిల్లావ్యాప్తం గా దాదాపు నాలుగు కోట్లు వసూలుకు లక్ష్యాలు విధించుకున్నాం. 2017 ఫిబ్రవరి నుం చి ఆగస్టు వరకు ఉన్న బకా యిల్లో ఇప్పటికి సుమారు రూ.రెండు కోట్లు వసూలైంది. మిగిలిన మొత్తాలు చెల్లించేలా పంచాయతీలకు మరోసారి సందేశాలు పంపిస్తున్నాం. బకాయిలు చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తాం.
– దత్తి సత్యనారాయణ, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌

మరిన్ని వార్తలు