‘విద్యుత్తు’లో క్రమబద్ధీకరణ కుదరదు

19 Mar, 2015 02:38 IST|Sakshi
‘విద్యుత్తు’లో క్రమబద్ధీకరణ కుదరదు
  • కాంట్రాక్టు కార్మికులకు సర్కారు మొండి చేయి
  • వారికి అర్హతలే లేవన్న మంత్రి అచ్చెన్నాయుడు
  • ఓట్ల కోసం హామీ ఇచ్చి ఇప్పుడు అన్యాయం చేస్తారా?
  • సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది. అసలు వారు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, క్రమబద్ధీకరించే యోచనేదీ లేదని  తేల్చి చెప్పింది. ఒప్పంద కార్మికులంతా అర్హత లేకుండా, అడ్డదారిన విద్యుత్ రంగంలోకి వచ్చారని సాక్షాత్తూ మంత్రి అచ్చెన్నాయుడు చులకనగా మాట్లాడటం సభలో గందరగోళానికి దారి తీసింది. వారి సమస్యలను  పరిశీలిస్తామనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు మంత్రి పేర్కొనటాన్ని వైఎస్సార్‌సీపీ ఆక్షే పించింది.

    శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని వైఎస్సార్ సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావించారు. దీనికి కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ విద్యుత్ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగులే లేరన్నారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. కార్మికులకు అన్యాయం చేయవద్దని వైఎస్సార్ సీపీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
     
    కనీస వేతనాలందేలా చూస్తాం: మంత్రి

    ప్రభుత్వం కేవలం కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ విషయమై సబ్ కమిటీ వేసిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాంట్రాక్టర్ ద్వారా వారికి కనీస వేతనాలు అందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ తీరును విపక్ష నేత జగన్ తప్పుబట్టారు. వారిని తమ ప్రభుత్వం వచ్చాక రెగ్యులర్ చేస్తామన్నారు.
     
    భరోసానిచ్చిన జగన్ హామీ: సీతారాం

    తమను ఉద్యోగులే కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించటాన్ని ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కేఎన్‌వీ సీతారాం తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పర్మనెంట్ చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వటాన్ని స్వాగతించారు. ఈ మాటలు ధైర్యాన్నిచ్చాయన్నారు.
     
    మేం వచ్చిన తర్వాతైనా పర్మనెంట్ చేస్తాం: జగన్

    విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేదే లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయటంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల్ని నమ్మించి వంచించటంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఒప్పంద కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని శాసనసభ్యుల హర్షధ్వానాల మధ్య సభలో ప్రకటించారు. ‘ఎన్నికల మానిఫెస్టోలో మీరు చెప్పిందేమిటి? ఆ రోజు మీరేమైనా కాంట్రాక్టు సిబ్బంది వేరే, ఔట్‌సోర్సింగ్ వేరే అని  చెప్పారా? ఔట్‌సోర్సింగ్‌లోనూ అదే అర్హతలున్నవాళ్లే ఉన్నారు. పోస్టుకు తగ్గ అర్హతలున్నవారినే ఎంపిక చేశా రు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టుకు రెండింటికీ చాలా చిన్న తేడా ఉంది. క్వాలిఫికేషన్‌లో తేడా లేదు. మీ మేనిఫెస్టోలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. ఉద్యోగులంతా మీ మాటలు నమ్మారు. వాళ్లను ఇవాళ నట్టేట ముంచొద్దండీ అని గట్టిగా చెబుతున్నాం. ఇంకొకటి కూడా చెబుతున్నాం. మీరు ఒకవేళ చేయకపోతే... మేం వచ్చిన తర్వాతైనా పర్మినెంట్ చేస్తామనే భరోసా ఒప్పంద కార్మికులకిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పర్మినెంట్ చేయమని ప్రభుత్వానికి చెబుతున్నాం’ అని జగన్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు