పవర్ కట్‌కట..

5 Jul, 2014 02:25 IST|Sakshi

 పవర్ కట్‌కట..
 సాక్షి, అనంతపురం :  అప్రకటిత విద్యుత్ కోతలతో ‘అనంత’ ప్రజలు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం మొదలైనా భానుడి భగభగ తగ్గకపోవడానికి తోడు కరెంట్ కష్టాలు మొదలవడంతో జనం ఉక్కపోత భరించలేకపోతున్నారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (ఎస్పీడీసీఎల్) సంస్థ ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరుతో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తూ వినియోగదారులను కష్టాలకు గురిచేస్తోంది. వాస్తవానికి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోతే.. ఎన్ని మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కాలేదో నిర్ణయించి ఆ లోటును అన్ని జిల్లాలకూ కేటాయించి కోత ప్రకటించాలి. అయితే అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
 
 పెరిగిన కోతల వేళలు (షెడ్యూలు) ప్రకటించకుండా ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తూ వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు. పొరుగు జిల్లాల్లో లేని విధంగా మన జిల్లాలో ఎడాపెడా కోతలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 12,02,594 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు ఒక్కటే 1,94,041 ఉన్నాయి. వీటన్నింటికీ రోజుకు 15 లక్షల యూనిట్ల విద్యుత్తు అవసరం. ఉత్పత్తి తక్కువగా ఉన్నందున జిల్లాకు 9 లక్షల యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు వారం రోజులుగా తిరిగి మొదటికొచ్చాయి.

39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయిన రోజుల్లో కూడా ఎస్పీడీసీఎల్ అధికారులు ఇష్టారాజ్యంగా సరఫరా నిలిపివేస్తున్నారు. ఫలితంగా వ్యాపార, పారిశ్రామిక, వర్గాల వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.కోతలు ఇలా.. అనంతపురం కార్పొరేషన్‌లో ఎంత విద్యుత్ కొరత ఉన్నప్పటికీ రెండు గంటల కంటే ఎక్కువ కోత విధించే వారు కాదు. అటువంటిది ఈసారి ప్రకటిత కోతలతో పాటు అప్రకటిత కోతలను కలుపుకుని రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రోజుకు 18 గంటలకు పైగా కోత విధిస్తున్నారు. పట్టణాల్లో 10 గంటల పాటు కోత విధిస్తున్నారు.  మూడు గంటలు కూడా కరెంటు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
 
 మా చేతుల్లో ఏమీలేదు.. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిపోయినందున లోడ్ డిస్పాచ్ కేంద్రాల నుంచి వచ్చే ఆదేశాల మేరకు తాము ఈఎల్‌ఆర్ కింద సరఫరా నిలిపివేయాల్సిందేనని, తమ చేతుల్లో ఏమీ లేదని ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.  
 

మరిన్ని వార్తలు