చెట్టు ఊగితే.. విద్యుత్‌ కట్‌

14 Jun, 2019 10:19 IST|Sakshi
వింజమూరు సబ్‌స్టేషన్‌

సాక్షి, వింజమూరు (నెల్లూరు): గత నెల రోజులుగా వింజమూరు మండలంలో విద్యుత్తు కోతలు ఎక్కువయ్యాయి. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీంతో వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. మండలంలో వింజమూరులో రెండు, తమిదపాడు, గుండెమడకల్లో సబ్‌స్టేషన్లు ఉన్నాయి. నాలుగు సబ్‌స్టేషన్లు ఉన్నా ఇంకా ఓవర్‌లోడ్‌ సమస్య ఉంది. వింజమూరు సుజాతనగర్‌ కాలనీ వాసులు లోఓల్టేజీ సమస్యతో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

మండలంలో 500 ట్రాన్స్‌ఫార్మర్లు, దాదాపు 11 వేల కనెక్షన్‌లు ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక చోట గాలివానకు చెట్టు విరిగిపడితే వింజమూరు పట్టణానికి రెండు మూడు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. పల్లెల్లో అయితే ఒక్కోసారి మూడు రోజుల వరకూ సరఫరాను పునరుద్ధరించడం లేదు. వేసవి కావడంతో ఎండ వేడిమికి సిబ్బంది సాయంత్రం 4 గంటల తర్వాత విద్యుత్‌ను ఆపి పనులు చేస్తున్నారు. దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.

కాలిపోతున్న ఇన్సులేటర్లు
ఆకాశం మేఘావృతమైతే వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. అక్కడక్కడా చెట్లు తీగలకు అడ్డంగా ఉండడంతో గాలి రాగానే రెండు తీగలు తగులుకుని ఫీజులు పోతున్నాయి. దీంతో ఎల్‌ఆర్‌ తీసుకుని ఫీజులు వేస్తున్నారు. ఎక్కడ వైరు తెగినా ఆ ఫీడరు మొత్తం విద్యుత్తు సరఫరా నిలచిపోతోంది. ఫలితంగా కొన్ని గ్రామాలు పూర్తిగా అంధకారంలో ఉంటున్నాయి. వింజమూరు పట్టణంలో తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటైతే ఆ ప్రాంతంలో విద్యుత్తు సమస్య ఏర్పడనప్పుడు సరఫరాను అక్కడ మాత్రమే నిలిపి వేసి మిగతా ప్రాంతమంతా సరఫరా చేయవచ్చు. ఆత్మకూరు నుంచి డీసీ పల్లి మీదుగా గుండెమడకల సబ్‌స్టేషనుకు విద్యుత్తు మెయిన్‌లైన్‌ సరఫరా కొద్దిపాటి వర్షానికే లైన్‌ కట్‌ అవుతోంది. ఈ సబ్‌స్టేషన్‌ నుంచి శంఖవరం ఫీడరుకు విద్యుత్‌ సరఫరాలో రోజుల కొద్ది అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ లైన్‌ వెళ్లే నేల నల్లరేగడి కావడంతో వర్షానికి, గాలివానకు స్తంభాలు నేలకు వాలి పడిపోతున్నాయి.

ఒకవేళ స్తంభాలు పడిపొతే కాంట్రాక్టర్‌ కోసం రెండు రోజులు వేచి ఉండి ఆ తర్వాత స్తంభాలు ఎత్తుతున్నారు. దానివల్ల రెండు మూడురోజుల పాటు ఆ లైన్‌ మొత్తం విద్యుత్‌ సరఫరా అవడం లేదు. నల్లగొండ్లలో గాలివానకు పడిపోయిన నాలుగు ట్రాన్స్‌ ఫార్మర్లను వారాల తరబడి అలాగే ఉంచారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలితో పాటు, ఉరుములు, మెరుపులు వచ్చిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. ఇటీవల విపరీతంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం పూట విద్యుత్తు సరఫరా లేక వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మాత్రం కచ్చితంగా కట్టించుకుంటున్నారని సరఫరా మాత్రం సరిగా ఉండడం లేదని విద్యుత్తు సిబ్బంది తీరును జనం ఎండగడుతున్నారు. మెరుపులు, ఉరుములు వస్తే ఇన్సులేటర్లు కాలిపోతున్నాయని అందుకోసం సరఫరా నిలిపి వేస్తున్నట్టు సిబ్బంది పేర్కొంటున్నారు.

నాలుగేళ్లుగా ఏఈ లేక ఇబ్బందులు
మండలంలో గత నాలుగేళ్లుగా ఏఈ లేక విద్యుత్తు సరఫరాలో ఇబ్బంది వస్తే పర్యవేక్షణ జరిపి సిబ్బందితో పనిచేయించే వారు లేకుండా పోయారని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యూలర్‌ ఏఈని నియమించకుండా ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో కొన్ని గ్రామాలకు వారంలో మూడు రోజుల పాటు కూడా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా జరగడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని విద్యుత్‌ సమస్యను తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

స్తంభాలు పడిపోయినా స్పందించడం లేదు 
కొద్దిపాటి గాలివానలకు స్తంభాలు పడిపోయి విద్యుత్‌ సరఫరా కావడం లేదు. గ్రామంలో అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయినా మరమ్మతులు చేయడానికి సిబ్బంది రావడం లేదు. రెగ్యూలర్‌ ఏఈని నియమించకపొతే సిబ్బంది సరిగా పని చేయరు.
 – బోగిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లగొండ్ల

మరిన్ని వార్తలు