గుండె కోత

23 Jan, 2014 02:20 IST|Sakshi

 అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : వేసవి రాకమునుపే కరెంటు కోతలు బెంబేలెత్తిస్తున్నాయి. రబీ పంటల సాగు సమయంలోనే ట్రాన్స్‌కో అధికారులు తమ మార్కును ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయానికి అధికారికంగా ఒక గంట కోత పెట్టారు. అనధికారికంగా రెండు గంటల పాటు తీసేస్తున్నారు. మిగిలిన ఐదు గంటలు కూడా విడతల వారీగా ఇస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితి. దీంతో అన్నదాతలు వ్యవసాయ బోరుబావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
 
 జిల్లాలో మొత్తం 1.96 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. వీటి కింద వాస్తవానికి 1,61,694 హెక్టార్లలో పంటలను సాగు చేయాలి. అయితే... కొన్నేళ్లుగా వేసవిలో కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో చాలా మంది రైతులు రబీలో పంటల సాగుకు వెనుకాడుతున్నారు. దీనికారణంగా ఏడాదికేడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం 1.33 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. ట్రాన్స్‌కో అధికారుల దెబ్బకు భయపడి రైతులు వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు స్వస్తి చెబుతున్నారు. బిందు సేద్యం(డ్రిప్)పై ఆధారపడి కూరగాయల పంటలు, కళింగర, దోస లాంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు.
 
 ఈ ఏడాది ఎక్కువగా కూరగాయలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పప్పుశనగ పంటలు వేశారు. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 16,124 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం ఆరు వేల హెక్టార్లకే పరిమితమైంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 19,448 హెక్టార్లు కాగా.. 12 వేల హెక్టార్లకు పరిమితమైంది. వాస్తవానికి వ్యవసాయానికి విద్యుత్‌కోత విధించరాదనే నిబంధన ఉంది. ఏడు గంటల పాటు నిర్విరామంగా సరఫరా చేయాలి. ట్రాన్స్‌కో అధికారులు మాత్రం అన్నదాతలపై శీతకన్ను వేస్తున్నారు. ఉత్పత్తి తగ్గిందన్న సాకు చూపి మొదట వ్యవసాయ రంగానికే కోత పెడుతున్నారు.
 
 కృత్రిమ కొరతేనా?
 చలి కాలంలోనూ కరెంట్ కోతలు విధిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాకు 14 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం. ప్రస్తుతం 13.2 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో వినియోగం ఎందుకు పెరిగిందో ట్రాన్స్‌కో అధికారులకే అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.
 
 రైతులకు మాత్రం ఇది శాపంగా పరిణమిస్తోంది. సాగు సమయంలోనే కోత పెడుతుండడంతో రబీ పంటలపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. కాగా... కోతల కారణంగా రైతులు నిత్యం వ్యవసాయ బోర్ల వద్దే ఉంటున్నారు. కరెంటు రాగానే అందరూ ఒకేసారి మోటార్లు వేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి కాలిపోతున్నాయి. వాటిని మరమ్మతు చేసేందుకు 10 నుంచి 15 రోజులు పడుతోంది. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయి. నిబంధనల మేరకు అర్బన్ పరిధిలో 24 గంటలు, రూరల్ పరిధిలో 48 గంటల్లోపు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాలి. దీన్ని అధికారులెవరూ పాటించడం లేదు.
 
 రైతుల ఇబ్బందులను గుర్తించాం
 విద్యుత్ సరఫరాలో లోటు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. ఆ లోటును ఎలాగోలా పూడుస్తున్నాం. పగలు కోత పెట్టినా రాత్రి వదులుతున్నాం.
 
 అక్కడక్కడ గంట పాటు కోత పడుతోంది. భవిష్యత్‌లో రైతన్నలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వేసవిలో వ్యవసాయానికి ఏ విధంగా విద్యుత్ సరఫరా చేయాలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం.
 - ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

>
మరిన్ని వార్తలు