‘కోత’లకు కత్తెర

28 May, 2020 05:40 IST|Sakshi

ఏడాదిలో తగ్గిన విద్యుత్‌ కోతలు 37%

మౌలిక సదుపాయాల మెరుగుదలతో నష్టాలు తగ్గుదల  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ అంతరాయాల నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించింది. కచ్చితమైన ప్రణాళికతో ఏడాది కాలంలోనే అంతరాయాలను 37 శాతం తగ్గించగలిగింది. అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్‌ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరిపారు. అప్పటి వరకూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ కోతలుండేవి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ మేరకు ఇంధన శాఖ ముందుకెళ్లి ఈ ఘనత సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి బుధవారం విడుదల చేశారు. 

► ట్రాన్స్‌కో 400, 200, 132 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.382.18 కోట్లు ఖర్చు చేశారు. రూ.85.40 కోట్లతో 389.75 కి.మీ మేర కొత్తగా ట్రాన్స్‌కో 
లైన్లు వేశారు. 
► ఏపీ డిస్కమ్‌ల పరిధిలో ఏడాదిలో 77 నూతన సబ్‌ స్టేషన్లు నిర్మించారు. 19,502.57 కి.మీ మేర కొత్త లైన్లు వేశారు. దీనికి రూ.524.11 కోట్లు వెచ్చించారు.  
► ఫలితంగా విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. అధిక లోడును తట్టుకునే శక్తి విద్యుత్‌ శాఖకు వచ్చింది. ఈ కారణంగా విద్యుత్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి.  
► నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలో రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్‌ డిమాండ్‌ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై లోడ్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది.

మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడం వల్ల ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే ట్రాన్స్‌కో నష్టాలు 2019–20లో 2.91 శాతానికి తగ్గాయి. డిస్కమ్‌ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. 

మరిన్ని వార్తలు