ప్రత్యక్ష నరకం!

31 May, 2019 10:11 IST|Sakshi
చీకట్లో అక్యూట్‌ మెడికల్‌ కేర్‌

అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గురువారం రోగులు ప్రత్యక్ష నరకం అనుభవించారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పురి టిశాలలో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన బీభత్సంతో వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్‌ సరఫరా పూర్తి స్థాయిలో జరగలేదు. అత్యవసర ఆపరేషన్లు మినహా అన్ని ఆపరేషన్లను వైద్యులు వాయిదా వేశారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం ప్రేక్షకపాత్ర వహించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న జనరేటర్లతో కొన్ని వార్డులకు కొంతసేపు.. మరికొన్ని వార్డులకు కాసేపు కరెంటు సరఫరా చేశారు.

గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం
విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ (ఏఎంసీ), పురిటిశాల (లేబర్‌వార్డు)లో రోగులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పురిటిశాలలోని టేబుల్స్‌పై గర్భిణులు ప్రసవం పొందే సమయంలో ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో డ్యూటీ వైద్యులు, హౌస్‌ సర్జన్లు సెల్‌ టార్చ్‌ వేసి ప్రసవాలు చేశారు. ఇక సిజేరియన్ల పరిస్థితి దేవునికెరుక. ఎప్పుడెప్పుడు కరెంటు వస్తుందా అంటూ వేచి ఉండాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌లో సిజేరియన్ల కోసం వైద్యులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలితకి చాలాసార్లు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చివరకు జనరేటర్‌ సహాయంతో కరెంటు సరఫరా అందించడంతో గైనిక్‌ వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఏఎంసీలో వెంటిలేటర్‌పై రెండు కేసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. బ్యాటరీ బ్యాక్‌అప్‌ ఉండడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఏఎంసీ వైద్యులు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందారు.

జనరేటర్‌తో సేవలు
ఆస్పత్రిలో వేకువజాము నుంచి విద్యుత్‌ లేదు. జనరేటర్ల సహాయంతో వార్డులకు కొంత కొంత సేపు సేవలందించాం. అత్యవసరం మినహా మిగతా ఆపరేషన్లు వాయిదా పడ్డాయి.– డాక్టర్‌ లలిత, ఆర్‌ఎంఓ

మరిన్ని వార్తలు