ఐదు రోజులుగా అంధకారం

31 May, 2019 13:05 IST|Sakshi
కొవ్వొత్తి వెలుగులో దుకాణం నిర్వహిస్తున్న దృశ్యం

చీకటిలో వద్దిరాల పరిసర గ్రామాలు

విద్యుత్‌ పునరుద్ధరణలో అధికారుల అలసత్వం

నీరు లేక, సెల్‌ఫోన్లు పనిచేయక ప్రజల అవస్థలు

మైలవరం మండలంలో ట్రాన్స్‌కో నిర్లక్ష్యం

సాక్షి ప్రతినిధి కడప : మైలవరం మండలంలోని వద్దిరాల, ఆ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలు ఐదు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నాయి. ఆదివారం రాత్రి వీచిన గాలి, వాన బీభత్సానికి మండలంలో పదుల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. అదే సమయంలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో కూడా విద్యుత్‌ స్తంభాలు కూలగా ఇక్కడి ట్రాన్స్‌కో అధికారులు సోమవారమే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. అయితే మైలవరం మండలంలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంగళ, బుధ వారాలకు మండలంలో సగం గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. గురువారం మరికొన్ని గ్రామాలకు విద్యుత్తును అందించారు. అయితే వద్దిరాల, ఆ చుట్టు పక్కల ఉన్న పది గ్రామాలకు గురువారం రాత్రి వరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేకపోయారు.

పాత రాతి యుగంలోకి ప్రజలు
ఇప్పటి యువతరానికి గుర్తు వచ్చినప్పటి నుంచి వరుసగా ఇన్ని రోజులు అంధకారంలో మగ్గిన సందర్భం లేదని వద్దిరాల ప్రజలు వాపోతున్నారు. అసలే ఎండాకాలం.. ఆపై మండుతున్న ఎండలు.. ఓవైపు ఉక్కపోత....మరోవైపు నీటి కొరత.. పనిచేయని ఫ్రిడ్జ్‌లు...తడారుతున్న గొంతులు...చల్లని తాగునీరు సైతం దొరకని పరిస్థితి. ఇన్వర్టర్లు ఉన్న ఇళ్లలో మొదటి రెండు రోజులు సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ అయినా పెట్టుకునే వారు. మొబైల్‌ ఫోన్లు సైతం మూగబోయాయి. ఎన్నో ఆశలతో ఎదురు చూసినప్పటికీ గురువారం ప్రియతమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కనీసం టీవీల్లో కూడా వీక్షించలేకపోయామని వద్దిరాల యువత చెబుతోంది.

నీటి కోసం తప్పని తిప్పలు
వద్దిరాల, ఆ పరిసర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో బోర్లు అస్సలు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం ట్యాంకర్లలో ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలు జిల్లా ఎర్రగుడి, హనుమంతగుండం గ్రామాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆ నీటి కోసం ఇక్కడి గ్రామాల్లో ప్రజలు గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. కొన్ని గ్రామాల్లో అయితే నేతలు తమ సొంత ఖర్చులతో జనరేటర్లను తెప్పించి బోరు బావుల నుంచి నీటిని తోడుతున్నారు. ఈ నాలుగు రోజులు వివాహాల ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో వారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరేటర్లకు అధిక డిమాండ్‌ ఉండడంతో 12 గంటల కాలానికి రూ. 1500 చొప్పున బాడుగ వసూలు చేస్తున్నారు.

ట్రాన్స్‌కోలో కొరవడిన సమన్వయం
మైలవరం ట్రాన్స్‌కో సిబ్బందికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం పూర్తిగా కొరవడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వీచిన గాలులకు విద్యుత్‌ స్తంభాలు పడిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోనట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నారని కర్నూలు జిల్లా నుంచి అదనపు సిబ్బందిని తెప్పించుకుని విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం ఐదు రోజులుగా అం«ధకారంలోనే మగ్గుతున్నారు. తిత్లి తుఫాను, హుద్‌హుద్‌ తుఫాను లాంటి పెద్ద తుఫాన్లు వచ్చిన సందర్భంలో కూడా కోస్తా ప్రాంతంలో రెండు, మూడు రోజులకే విద్యుత్‌ పునరుద్ధరణ పనులు జరిగినప్పటికీ చిన్న గాలివానకే ఐదు రోజులపాటు పల్లెలను అంధకారంలో ముంచెత్తిన ఘనత మైలవరం ట్రాన్స్‌కో అధికారులకు దక్కుతుందని వద్దిరాల పరిసర గ్రామాల ప్రజలు అంటున్నారు. కాగా, మైలవరం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులును ఈ విషయమై వివరణ  కోరేందుకు సాక్షి ప్రతినిధి ప్రయత్నించగా, ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

మరిన్ని వార్తలు