తగ్గిన విద్యుత్ డిమాండ్

12 Jan, 2015 23:40 IST|Sakshi

నాన్ పీక్ అవర్స్‌లో యూనిట్ల నిలిపివేత
బొగ్గు నిల్వలు పెంచేందుకు జెన్‌కో కసరత్తు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గుతోంది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కొన్ని యూనిట్లలో ఉత్పత్తి నిలిపేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం నుంచి ఉదయం వరకు (నాన్ పీక్ అవర్స్) యూనిట్లను ఆపేస్తున్నారు. ఇదే సమయంలో బొగ్గు సరఫరా కూడా పెరగడంతో ఏపీ జెన్‌కోకు కాస్త ఊరట లభించింది.

రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా 500 మెగావాట్ల మేర డిమాండ్ తగ్గింది. గత రెండు రోజులుగా అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. దీంతో మరో 100 మెగావాట్ల వాడకం తగ్గింది. వీటీపీఎస్, ఆర్టీపీఎస్, సింహాద్రిలో మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

సోమవారం నాటికి థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిని రెండువేల మెగావాట్లు తగ్గించి.. 2,500 మెగావాట్లకు పరిమితం చేశారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొగ్గును నిల్వచేసేందుకు జెన్‌కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు