వాడిన విద్యుత్‌కే బిల్లు

12 May, 2020 05:21 IST|Sakshi

రెండు నెలల తర్వాత రీడింగ్‌ తీసినా నెలవారీగానే బిల్లింగ్‌

రెండు నెలలదీ కలిపి... శ్లాబ్‌  పెంచారనేది అపోహే

లాక్‌డౌన్‌తో గృహ వినియోగం పెరిగింది

విద్యుత్‌ బిల్లుల తప్పుడు ప్రచారంపై విద్యుత్‌ శాఖ వివరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి పేర్కొన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్‌ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి, ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులేనన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్‌ తీసినా... బిల్లింగ్‌ మాత్రం ఏ నెలకానెలే చేశామని తెలిపారు. బిల్లింగ్‌ చేసిన విధానాన్ని ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు. 

► ప్రతి 30 రోజులకోసారి తీసే మీటర్‌ రీడింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా 60 రోజులకు (మార్చి, ఏప్రిల్‌ వినియోగం) తీశాం.
► ఏప్రిల్‌ 1 నుంచి ఏపీఈఆర్‌సీ ప్రకటించిన కొత్త టారిఫ్‌ అమలులోకి వచ్చింది. మార్చిలో 10న రీడింగ్‌ తీయడం వల్ల మిగిలిన 21 రోజులనే లెక్కలోకి తీసుకున్నాం. అంటే రీడింగ్‌ తీసిన 60 రోజులలో 21 రోజులు మార్చి నెలకు, మిగిలినవి ఏప్రిల్‌లోకి విభజించాం. 
► 75 యూనిట్లలోపు వినియోగం ఉంటే ఏ కేటగిరీలోనే ఉంటారు. 225 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగం ఉంటే బీ కేటగిరీ కిందే లెక్కిస్తారు. ఆ పైన వినియోగం ఉన్న వాళ్లే కేటగిరీ సీలోకి వెళ్తారు. 500 యూనిట్లుపైన వినియోగం ఉన్నవాళ్లకు మాత్రం ఈ ఏడాది యూనిట్‌కు 90 పైసలు పెంచారు. కాబట్టి తక్కువ వినియోగం ఉన్న వారికి ఎలాంటి అదనపు భారం పడే వీలే లేదు.
► గత ఐదేళ్ల విద్యుత్‌ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ప్రతీ ఏడాది మార్చి నెలలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఈసారి లాక్‌డౌన్‌ వల్ల ప్రతీ ఒక్కరూ గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగింది. ఫలితంగా యూనిట్లు పెరిగి శ్లాబులూ మారాయి. అంతే తప్ప రెండు నెలల రీడింగ్‌ వల్ల ఏ మార్పూ రాలేదు. 

మరిన్ని వార్తలు