కట్టె పూడ్చుకో.. కనెక్షన్‌ తీసుకో!

15 May, 2019 11:10 IST|Sakshi
ట్రాన్స్‌ఫార్మన్‌ నెపంతో వసూళ్లు నిర్మాణంలో ఉన్న షాప్‌కి కట్టెలు పూడ్చి కనెక్షన్‌ ఇచ్చిన దృశ్యం

విద్యుత్‌శాఖలో కొనసాగుతున్న దందా

చక్రం తిప్పుతున్న ఏడీలు

సంవత్సరానికి రూ.50 నుంచి 60 కోట్ల మామూళ్లు

అనంతపురం సిటీ: పేదవారు విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు. అదే బడా బాబులు దరఖాస్తు చేసుకుంటే మాత్రం మామూళ్లు తీసుకుని యథేచ్ఛగా కనెక్షన్‌లు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్టిమేషన్‌ లేకపోయినా ఏకంగా కట్టెలు పూడ్చి కనెక్షన్లు ఇచ్చేస్తున్నారంటే విద్యుత్‌శాఖలో ఈ దందా ఏ మేరకు సాగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ దందా ద్వారా జిల్లా వ్యాప్తంగా సంవత్సరానికి ఏకంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నత స్ధాయి వరకూ వాటాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో ఏడీ స్థాయి అధికారులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

చేయాల్సింది ఇలా...
సాధారణంగా ఒక ఇంటికి గానీ షాపింగ్‌ కాంప్లెక్స్‌కి గానీ విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటికి అయితే రూ.1,450, షాపింగ్‌ కాంప్లెక్స్‌కి అయితే రూ.3,200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగానే దీనికి సంబంధించిన ఎస్టిమేషన్‌ను తయారు చేయాలని ఏఈని ఆదేశిస్తారు. ఏఈ గానీ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ గానీ వెళ్లి దరఖాస్తుదారుని ఇంటికి ఎన్ని స్తంభాలు పడతాయి? కేబుల్‌ వేయాలా, కండెక్టర్‌ వేయాలా అన్న విషయాన్ని ఎస్టిమేషన్‌ వేసి ఏడీకి అందజేయాల్సి ఉంటుంది. ఏడీ తిరిగి దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుని అనుమతి నిమిత్తం దాన్ని డీఈ, ఎస్‌ఈలకు పంపాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్‌ అనంతరం దరఖాస్తుదారుడు డీడీ రూపంలో డబ్బు చెల్లించిన తర్వాత కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి మామూళ్లు తీసుకుని బడా బాబులకు ఇష్టారాజ్యంగా కనెక్షన్‌లు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.

ఒక్కోచోట కొద్ది కొద్ది దూరంలో ఆరేడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఇక అధికారులకు పండగే. ఆయా ఇళ్ల యజమానులను పిలిపించి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ లేకుంటే పని జరగదని అందుకు కాస్త ఆలస్యమవుతుందని, కాబట్టి నలుగురూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నట్లు తెలిసింది. అయితే డీడీ కట్టే సమయంలో సైతం ఎస్టిమేషన్‌ ఎక్కువ అవుతుందని... ఇక మీరే తేల్చుకోండని నిర్ణయాన్ని ఇంటి యజమానులకే వదిలేస్తారు. ఎక్కువ ఎస్టిమేషన్‌ చూపి ఇంటి యజమానుల ద్వారా లంచాలు తీసుకుని కట్టెలతో పని కానిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ.50 నుంచి 60 కోట్లు మామూళ్లుగా అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు ఇలా ఇచ్చిన కనెక్షన్ల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 62 శాతానికి ఎస్టిమేషన్లే లేవని ఆ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా కలెక్టర్‌ చర్య తీసుకుని ఈ మామూళ్ల దందాకు చెక్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నీటి సాకుతో బేరం షురూ...
గతంలో ఇంటి యజమాని దగ్గరుండి నిర్మాణాలను చేపట్టేవారు. ప్రస్తుతం కొంత సొమ్మును కాంట్రాక్టరుకు చెల్లించి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటిని నిర్మించి ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు నీరు అవసరం గనుక వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ వేయించాలని యజమానిని కోరుతాడు. ఇక్కడి నుంచే అసలు దందా మొదలవుతోంది. యజమాని దరఖాస్తు చేసుకోగానే లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ లేదా ఏఈ వెళ్లి ఎస్టిమేషన్‌ వేసి ఏడీ పరిశీలన, డీఈ, ఎస్‌ఈల అనుమతికి కావాల్సిన స్తంభాలు రావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని బెదరగొడుతున్నట్లు సమాచారం. దీంతో విద్యుత్‌ కనెక్షన్‌ లేని కారణంగా నీరు లేకపోతే నిర్ణీత సమయానికి ఇంటి నిర్మాణం పూర్తి కాదని భావించి యజమాని ఎంతైనా చెల్లించడానికి సిద్ధపడతాడు. దీన్ని అవకాశంగా తీసుకుని అధికారులు ఒక్కొక్కరి నుంచి రూ.40 నుంచి రూ.లక్ష వరకూ తీసుకుని బడాబాబుల ఇళ్లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టెలను పూడ్చి కనెక్షన్‌ను ఇచ్చేస్తున్నారని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ అధికారులు ఈ తంతును కొనసాగిస్తున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు