పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఊరట

16 Apr, 2020 05:20 IST|Sakshi

మార్చి విద్యుత్‌ బిల్లుల వసూలు తాత్కాలికంగా నిలిపివేత

క్షేత్రస్థాయి సిబ్బందికి ఇంధన శాఖ ఆదేశాలు 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కాలంలో మూతపడిన పరిశ్రమలు, తెరుచుకోని వాణిజ్య సంస్థలకు విద్యుత్‌ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాస్తవ వినియోగానికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌ తీసే వరకు పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలకు ఉన్నతాధికారులు బుధవారం సంకేతాలు పంపించారు. 

వాస్తవ రీడింగ్‌ తీసే వరకూ..
లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలు చాలా వరకూ మూతపడ్డాయి. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు వంటివి కూడా కార్యకలాపాలు నిర్వహించడం లేదు.
► లాక్‌డౌన్‌ కారణంగా రీడింగ్‌ తీసే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో వినియోగించిన యూనిట్ల ఆధారంగా మార్చి నెలకు ఇచ్చిన బిల్లులనే చెల్లించాలని వినియోగదారులకు మెసేజ్‌లు వెళ్లాయి.
► మార్చి నెలలో కొన్ని రోజులు విద్యుత్‌ వినియోగించ లేదని, అయినా బిల్లులు ఎలా చెల్లిస్తామని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అభ్యంతరం లేవనెత్తాయి.
► దీనిపై స్పందించిన ఇంధన శాఖ వాటికి బిల్లులు ఇచ్చినా వాస్తవ రీడింగ్‌ తీసే వరకూ చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలిచ్చింది. 
► ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు రూ.వెయ్యి కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అంచనా. 
► ఏప్రిల్‌లో కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది కాబట్టి ఇదే తరహా మినహాయింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. 

వసూళ్లు నిలిపేశాం
విద్యుత్‌ వాడనప్పుడు బిల్లులు వసూలు చేయడం సరికాదని ఇంధన శాఖ భావించింది. ఈ దృష్ట్యా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు జారీ అయిన బిల్లుల వసూలుకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చాం. తదుపరి ఉత్తర్వులు అందే వరకూ డిస్కమ్‌లు ఈ ఆదేశాల్ని పాటిస్తాయి.    
– శ్రీకాంత్‌ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి 

మరిన్ని వార్తలు