కరోనా షాక్‌ 4,700 కోట్లు!

6 May, 2020 04:55 IST|Sakshi

విద్యుత్‌ అంచనాలన్నీ తారుమారు

డిమాండ్‌ 6,300 మిలియన్‌ యూనిట్ల తగ్గుదల

మొదటి త్రైమాసికంలో ముప్పెక్కువ

కష్టాల్లోనూ వ్యవసాయ పంపుసెట్లకు ఫుల్‌ పవర్‌

భారీ నష్టంపై ప్రభుత్వానికి విద్యుత్‌ శాఖ నివేదిక  

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కోలుకోలేని దెబ్బ తీసింది. లాక్‌డౌన్‌తో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ వాడకం పూర్తిగా స్తంభించడంతో అంచనాలు తారుమారయ్యాయి. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే వ్యవసాయ, గృహ విద్యుత్తు వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ విద్యుత్‌ సంస్థల వాస్తవ పరిస్థితిని విశ్లేషిస్తూ ఇంధనశాఖ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ వివరాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి మంగళవారం మీడియాకు వెల్లడించారు.

► 2020–21లో 59,957 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేయగా కరోనా ప్రభావంతో 53,657 ఎంయూలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. వాడకం 6,300 ఎంయూలు (11 శాతం) తగ్గవచ్చు.

► రెవెన్యూ వసూళ్లు రూ.30,032 కోట్లు ఉంటాయని అంచనా వేసినా రూ.25,346 కోట్లకే పరిమితం కానున్నాయి. రూ.4,686 కోట్లు (16 శాతం తక్కువ) నష్టం వాటిల్లే వీలుంది. మొదటి త్రైమాసికంలో నష్టం 38 శాతం వరకు ఉంది. 

► లాక్‌డౌన్‌ అమలైన మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం 4,666 మిలియన్‌ యూనిట్లకు బదులుగా 1,854 మిలియన్‌ యూనిట్లే ఉంది. వాణిజ్య విద్యుత్‌ డిమాండ్‌ 833 మిలియన్‌ యూనిట్లకు బదులుగా 697 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉంది. గృహ విద్యుత్‌ వినియోగంలో ఎలాంటి మార్పు లేదు. కానీ సబ్సిడీతో అందించే ఈ కరెంట్‌తో విద్యుత్‌ సంస్థలకు అదనపు రెవెన్యూ ఉండదు.

భారీ నష్టమే
విద్యుత్‌ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.4,700 కోట్ల మేర నష్టపోవడం సాధారణ విషయం కాదు. సేవాభావంతో పని చేస్తున్న విద్యుత్‌ సంస్థలు ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పరిస్థితిపై నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందుంచాం.. – శ్రీకాంత్‌ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి)

మరిన్ని వార్తలు