క్రమబద్ధీకరణ కోసం పోరుబాట

13 Dec, 2018 12:45 IST|Sakshi
ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగులు (ఫైల్‌)

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమాయత్తం

ఇప్పటికే పలుమార్లు నిరసనలు

21న విజయవాడలో భారీ బహిరంగ సభ

ఏలూరు (టూటౌన్‌): విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇప్పటికే దశలవారీగా పలు రూపాల్లో తమ ఆందోళనను వ్యక్తం చేసిన వీరు ఈనెల 21న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా అంతటా వెలుగులు నింపడంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మి కుల జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇచ్చిన హా మీలను అమలు చేయకపోవటంతో కొంతకాలంగా వీరు ఉద్యమ బాటలో నడుస్తున్నారు. జిల్లాలో 223 సబ్‌స్టేషన్లు, జిల్లా ఎస్‌ఈ కార్యాలయం, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం, సెక్షన్‌ ఆఫీస్‌లు, రీడర్స్‌గా డివిజన్, సబ్‌డివిజన్‌ పరి ధిలో 1,800 మందికి పైగా పనిచేస్తున్నారు. షిఫ్ట్‌ ఆపరేటర్లు , కంప్యూటర్‌ ఆపరేటర్లు, పీక్‌లోడ్, వాచ్‌ అండ్‌ వార్డ్‌లు సహా పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరంతా 15 నుంచి 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనంతో నెట్టుకొస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామన్న హామీ అమలు అవ్వాలని వందలాది కుటుం బాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రస్థాయి సమస్యలతో పాటు స్థానికంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..
ప్రస్తుతం వీరికి ప్రభుత్వం మధ్యవర్తి అయిన కాంట్రాక్టర్‌ ద్వారా జీతాలు చెల్లిస్తుంది. అరకొర వేతనాల్లో సైతం కాంట్రాక్టర్‌ కమీషన్‌ తీసుకుంటున్నారు. పైగా వేధింపులు కూడా ఉంటున్నాయి. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని వీరు కోరుతున్నారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు గట్టిగా కోరుతున్నారు. విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు పీస్‌ రేటును రద్దు చేసి, ఫిక్స్‌డ్‌ వేతనాలు చెల్లించాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. తమ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎలుగెత్తి చాటుతున్నారు.

ప్రమాదాలతో సహవాసం
విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు నిత్యం ప్రమాదాల సహవాసం తప్పటం లేదు. గతంలో ఆకివీడు మండలంలో గాయపడిన కార్మికుడు భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగపాలెం మండలం ఆసన్నగూడెం సబ్‌స్టేషన్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌ శ్రీను తీవ్రగాయాలతో జంగారెడ్డిగూడెంలో చికిత్స పొందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్, ప్రభుత్వం వీరిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు.

నాలుగేళ్ల తర్వాత స్వల్ప పెంపుదల
గత ఆగస్టులో కాంట్రాక్టు కార్మికుల జీతాలు స్వల్పంగా పెంచారు. అదీ 2014లో పెంచాల్సిన జీతాలను 2018లో స్వల్పంగా పెంచడంపై కా ర్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని కార్మికులు ఎద్దేవా చేస్తున్నారు. విద్యుత్‌ సంస్థను లాభాలబాటలో నడిపిస్తూ, పలు అ వార్డులు రావటానికి కారణం అయిన కార్మికులను విస్మరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దళారులు దోచుకోకుండా తమను సంస్థలో విలీనం ఎం దుకు చేయకూడదూ అంటూ నిలదీస్తున్నారు. తె లంగాణలో రెండేళ్ల క్రిందటే విద్యుత్‌ సంస్థలో విలీనం చేసుకున్నారని చెబుతున్నారు. కార్మికులను విలీనం చేసుకున్నా న్యాయపరమైన ఇబ్బందులు రావని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని కార్మికులు గుర్తుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు