‘పవర్’ లేని పవనిజం

28 Mar, 2014 01:31 IST|Sakshi
‘పవర్’ లేని పవనిజం
  • అభిమానుల్లో జోష్
  •  ఆశావహుల్లో నీరసం!
  •  నిర్వాహకులు ఆశించినంతగా లేని జనం
  •  సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధినేత పవ న్ కల్యాణ్ విశాఖ నగరంలో గురువారం నిర్వహించిన తొలి రాజకీయ సభ ఆశావహుల పాలిట అశనిపాతంగా మారింది. అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నించిన ఆయన జనసేన పార్టీ తరఫున రాజకీయరంగ ప్రవేశం చేయాలనుకున్నవారికి మాత్రం షాకిచ్చారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పూర్తి మద్దతుంటుందని చెప్తూనే.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసేది లేద ని, అభిమానులంతా ఎవరికి ఇష్టమున్న నేతకు వారు ఓటేసుకోవచ్చని స్పష్టం చేశారు.

    పార్టీ ప్రకటన సభ మాదిరిగానే తొలి రాజకీయ బహిరంగ సభను కూడా పవన్ కల్యాణ్ ఒక్కరే నడిపించారు. సుమారు 1.15 గంటలు ప్రసంగించిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. అవకాశవాద కాంగ్రెస్ నేతల్ని కూకటివేళ్లతో సహా పెకిలించేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. విభజన సమయంలో ఎమ్మెల్యేలు కావూరి, రాయపాటితోపాటు, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ తీరును తీవ్రంగా ఖండించారు. జన సమీకరణలో మాత్రం నిర్వాహకులు చెప్పిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు.

    అసలే గ్రౌండ్ చిన్నది.. అయినప్పటికీ వేసిన కుర్చీలు మేరకు తప్ప.. మిగిలిన భాగమంతా ఖాళీగా దర్శనమిచ్చింది. సభ కూడా అనుకున్న సమయానికంటే సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమయింది. అభిమానులు మాత్రం పవన్ ప్రసంగాన్ని ఆసాంతం విని కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. అభిమానులు అత్యుత్సాహంపై అక్కడక్కడ పోలీసులు లాఠీలు ఝళిపించాల్సి వచ్చింది. 2014 అడుగుల జెండాను అభిమానులు ఆవిష్కరించారు.
     

మరిన్ని వార్తలు