విశాఖ స్టీల్‌ప్లాంట్ లో పవర్ ప్లాంట్ ప్రారంభం

31 Mar, 2015 20:43 IST|Sakshi

విశాఖపట్నం : నవరత్న సంస్థ 'విశాఖ స్టీల్‌ప్లాంట్' విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు వేసింది. ప్లాంట్ నిర్వహణకు సొంతగా  విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు పవర్ ప్లాంట్ ప్రారంభించింది. నూరు శాతం బ్లాస్ట్‌ఫర్నేస్ గ్యాస్, కోక్ ఒవెన్ గ్యాస్‌తో నిర్వహించనున్న 120మెగావాట్ల కాలుష్యరహిత పవర్‌ప్లాంట్ దేశీయ ఉక్కు పరిశ్రమలో ఇదే మొదటిసారి కావడం విశేషం. మంగళవారం జరిగిన పవర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ సిఎండి పి. మధుసూదన్ మొదటి బాయిలర్‌ను లైటప్ చేశారు. రూ.676 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో సిఎండీ మాట్లాడుతూ ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా ఉక్కు ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన విద్యుత్‌ కొరకు గ్రిడ్‌పై ఆధారపడకుండా సొంతగా తయారుచేసుకోగలమన్నారు.

డైరక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్ర, డైరక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావులు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న 6.3 మిలియన్ టన్నుల విస్తరణ సామర్ద్యానికి 418మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందన్నారు. ప్రస్తుతం 60 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 3 టర్బో జనరేటర్ల ద్వారా 180 మెగావాట్లు, 67.5 మెగావాట్ల సామర్ద్యం కలిగిన రెండు జనరేటర్ల ద్వారా 135 మెగావాట్లతో మొత్తం 315మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు