అంధకారంలో ప్రాంతీయ ఆస్పత్రి

18 Apr, 2019 11:54 IST|Sakshi
వార్డులో కొవ్వొత్తులు వెలిగించుకున్న రోగులు

ఉక్కపోతతో అవస్థలు పడ్డ రోగులు

మూడు గంటల పాటు చీకట్లోనే..

కొవ్వొత్తుల వెలుగులు, సెల్‌ఫోన్ల లైటింగ్‌తోనే వైద్యం

పాడేరు జిల్లా ఆస్పత్రిలో కానరాని జనరేటర్‌ సదుపాయం

పాడేరు రూరల్‌:   పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని 200 పడకల వరకు పెంచి, జిల్లా స్థాయి ఆస్పత్రిగా మార్చినప్పటి నుంచి రోగులకు కష్టాలు అధికమయ్యాయి. పేరుకు జిల్లా స్థాయి ఆస్పత్రి అయినా కనీస స్థాయిలో కూడా సదుపాయాలు కల్పించలేదు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ సదుపాయం అందుబాటులో లేదు.   బుధవారం రాత్రి 6.30 గంటల సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 9గంటలైన విద్యుత్‌ పునరుద్ధరణ కాలేదు. దీంతో రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.  చీకట్లోనే గడపవలసి వచ్చింది. 

సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన కొవ్వత్తుల వెలుతురు, సెల్‌ఫోన్ల లైటింగ్‌లోనే రాత్రి భోజనాలు చేశారు. ఈ వెలుతురులోనే సిబ్బంది వైద్యసేవలందించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగడం, జనరటర్‌ అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్లు తిరిగక రోగులు, బంధువులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రతి సారి ఇదే పరిస్థితి నెలకొంటోంది. కానీ వైద్య విధాన పరిషత్‌ అధికారులు మాత్రం స్పందించడం లేదు.   ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి జనరేటర్‌ను అందుబాటులోకి తేవాలని రోగులు, బంధువులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు