అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగనందుకే..

2 Nov, 2017 02:34 IST|Sakshi

భన్వర్‌లాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు

జోక్యం చేసుకోవాలంటూ ఈసీకి మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ లేఖ  

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవడంతో రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏ.కే.జ్యోతికి బుధవారం ఆయన లేఖ రాశారు. సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో వివరించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుగుణంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌పై మూసివేసిన కేసులను తిరగతోడి వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులపై వేధింపులకు తానే సాక్షినన్నారు.

ప్రభుత్వం దమననీతికి నిదర్శనం
2014 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌కు పదోన్నతి కల్పించకుండా అదే బ్యాచ్‌కు చెందిన ఇతర అధికారులకు మాత్రం ఇచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రమోషన్లకు కేసులు అడ్డంకిగా ఉన్నప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ప్రభుత్వం తనపై కేసును మూసివేయకుండా చాలా ఏళ్లు పక్కన పెట్టినప్పటికీ భన్వర్‌లాల్‌ ఎప్పుడూ భయపడలేదన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కేసును ఒక కొలిక్కి తేవటానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలిపారు. ఆ తర్వాత కేసును మూసివేసి భన్వర్‌లాల్‌కు ప్రమోషన్‌ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదవీ విరమణ రోజున తిరగతోడటం దమననీతికి అద్ధం పడుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని, లేదంటే సొంత రాష్ట్రానికి చెందిన క్యాడర్‌ అధికారులు ఎన్నికల అధికారులుగా పనిచేయడానికి ముందుకురారని ఐవైఆర్‌ నివేదించారు. ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా పనిచేయని పలువురు అధికారులను ప్రభుత్వం ఎలా పక్కన పెట్టిందో తనకు తెలుసన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఇతర రాష్ట్రాలకు చెందిన క్యాడర్‌ అధికారులను నియమించాలని ఐవైఆర్‌ సూచించారు.  కాగా  పదవీ విరమణ చేసిన రోజునే భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కక్ష సాధింపులో భాగమేనని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ విమర్శించింది.

మరిన్ని వార్తలు