కొత్త సర్పంచ్‌లకు విద్యుత్ శాఖ ‘షాక్’

2 Aug, 2013 02:29 IST|Sakshi

నర్సీపట్నం, న్యూస్‌లైన్ : కొత్త సర్పంచ్‌లకు విద్యుత్ శాఖ షాకిచ్చింది... పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులు పంపింది. రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో పూర్తిస్థాయిలో దీని గురించి పట్టించుకోని విద్యుత్‌శాఖ కొత్త పాలకవర్గాల నుంచి బకాయిలు రాబట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితం పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథకం(బీఆర్‌జీఎస్) కింద రావాల్సినసుమారు రూ.30 కోట్లు ఆపేసింది.
 
 అప్పటి నుంచి పంచాయతీలన్నీ ఆర్థిక లేమితో సతమతమవుతున్నాయి. ప్రత్యేకాధికారులు పల్లెల్ని పూర్తిగా పట్టించుకోలేదు. దాంతో అన్నింటా ఆదాయవనరులు లేకుండా పోయాయి. వీధి దీపాలు, తాగునీటి పథకాలకు సంబంధించి విద్యుత్ బిల్లుల చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. జిల్లాలోని 920 పంచాయతీల్లో 35 మేజర్లున్నాయి. వీటిలో వీధిదీపాలు, మంచినీటి పథకాల విద్యుత్ బకాయిలు రూ. 19 కోట్లు మేర పేరుకుపోయాయి. ఇటీవల మేజరు పంచాయతీలు అరకొరగా బిల్లులు చెల్లించాయి. పరిస్థితి దయనీయంగా ఉన్న మైనరు పంచాయతీలు నయాపైసా చెల్లించకుండా చేతులెత్తేశాయి. గతంలో వీటి బిల్లులు ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. పంచాయతీలకు మంజూరు చేసే నిధుల నుంచి వాటిని మినహాయించుకునేది. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 20 కోట్లు, ఇతర పద్దుల కింద మరో రూ. 10 కోట్లు విడుదల కాలేదు. దాంతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కొత్త పాలకవర్గాలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి.
 
  కేంద్రం నిధులు ఇక విడుదలవుతాయి. కొత్త సర్పంచ్‌లు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి ఇటీవల విద్యుత్‌శాఖ అధికారులు నోటీసులు పంపారు. రెండు మూడు నెలల్లో చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించినట్టు భోగట్టా. రూ. లక్షలు ఖర్చుచేసి ఎన్నికయిన సర్పంచ్‌లంతా ఇదేం బెడదంటూ గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం సకాలంలో నిధులివ్వకుంటే ఆ భారం కూడా తమపై పడుతుందని వాపోతున్నారు. లేదా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఆ అపవాదు తమకు తప్పదని మదనపడుతున్నారు.

మరిన్ని వార్తలు