చీకట్లో ‘కృష్ణా’

9 Oct, 2013 03:28 IST|Sakshi

 సాక్షి, విజయవాడ :  సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రభావం మంగళవారం తారస్థాయికి చేరింది. జిల్లా వ్యాప్తంగా 8 గంటలకు పైగా విద్యుత్ కోతలను విధించారు. గ్రిడ్‌పై ఒత్తిడి పెరగడంతో రాత్రి మరో రెండు గంటలు అప్రకటిత విద్యుత్‌కోతను విధించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రోజు మొత్తం మీద కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరగడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమైక్యాంధ్ర జేఏసీ, విద్యుత్ జేఏసీ నేతల చర్చలు విఫలం అవ్వడంతో బుధవారం నుంచి విద్యుత్ కోతలను 12 గంటలకు పెంచాలని జేఏసీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడుగంటల వరకు కోతలకు అవకాశం ఉంది.
 
 సీమాంధ్ర ప్రాంతం నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో దాని ప్రభావం గ్రిడ్‌పై పడుతోంది. ఒత్తిడి పెరిగితే విద్యుత్ కోతలు 12 గంటలు దాటిపోతాయని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, తప్పని పరిస్థితుల్లో రాత్రివేళల్లోనూ కోతలు తప్పవని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఆదాయపన్నుశాఖ, బీఎస్‌ఎన్‌ఎల్, టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, బ్యాంకులకు విద్యుత్ సరఫరా కాకుండా చర్యలు తీసుకుని సమ్మె ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని జేఏసీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు