గిరి పల్లెల్లో విద్యుత్‌ కాంతులు

19 Sep, 2019 07:59 IST|Sakshi
రిబ్బన్‌ కట్‌ చేసి విద్యుత్‌ లైన్‌ ప్రారంభిస్తున్న ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌

125 గ్రామాలకు తీరిన అంధకార సమస్య 

కృష్ణాదేవిపేట–కాకరపాడు విద్యుత్‌ లైన్‌ ప్రారంభం

ప్రత్యామ్నాయ లైన్‌గా మారనున్న రాజవొమ్మంగి

జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్

రూ.వంద కోట్లతో 30 సబ్‌స్టేషన్ల నిర్మాణం

విద్యుత్‌ లేని 126 గ్రామాలకు రూ.28 కోట్లతో ప్రతిపాదన

ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌ వెల్లడి

ఒకటి.. రెండు కాదు ఏకంగా 125 గిరిజన గ్రామాలకు విద్యుత్‌ సమస్య తొలగిపోయింది. తూర్పువిద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) ఎస్‌ఈ టి.వి.సూర్యప్రకాశ్‌ బుధవారం కృష్ణాదేవిపేట నుంచి కాకరపాడు వరకు వేసిన 26 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్‌ లైన్‌ను ప్రారంభించారు. దీంతో ఇంత వరకు పూర్తిస్థాయి విద్యుత్‌ సరఫరాను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం 132)33 కేవీ నుంచి పొందిన కాకరపాడు సబ్‌స్టేషన్‌ ఇప్పుడు దానిని ప్రత్యామ్నాయంగా వాడనుంది. కృష్ణాదేవిపేట 33/11కేవీ లైన్‌ నుంచి సరఫరా అవుతుంది. రూ.2.5 కోట్లతో 26 కిలోమీటర్ల దూరంలో 443 స్తంభాలను, 35 టవర్లను నిర్మించారు. పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా కానుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి, కొయ్యూరు/గొలుగొండ: విద్యుత్‌ సమస్యలు గిరిజనులకు తీరనున్నాయి. ఇప్పటి వరకూ వేరే జిల్లా నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే సందర్భంలో సాంకేతిక కారణాలతో పడిన ఇబ్బందులను గిరిజనులు ఇక మరచిపోవచ్చని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌ అన్నారు. కృష్ణాదేవిపేటలో కాకరపాడుకు సబ్‌స్టేషన్‌కు వేసిన ప్రత్యేక విద్యుత్‌లైన్‌ను ఆయన  ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచి కాకరపాడుకు కృష్ణాదేవిపేట నుంచి విద్యుత్‌ సరఫరా అవుతోందదన్నారు. ఏ కారణంతోనైనా విద్యుత్‌ నిలిచినా వెంటనే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి నుంచి సరఫరా పొందవచ్చన్నారు. ప్రతీ గ్రామానికి 24 గంటల విద్యుత్‌  సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. మన్యంలో విద్యుత్‌ లేని గ్రామాలు 126 ఉన్నాయన్నారు. వాటికి విద్యుత్‌ సౌకర్యం కోసం రూ.28 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు.

జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్‌
జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్‌ వేసేందుకు 36 కిలోమీట్లకు రూ.నాలుగు కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించినట్టు ఎస్‌ఈ చెప్పారు. దీనికి అనుమతి వస్తే పనులు ప్రారంభిస్తారన్నారు. ఈ లైన్‌ వేస్తే చింతపల్లికి కూడా విద్యుత్‌ సమస్య చాలా వరకు తొలగిపోతుందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో కొన్నింటిని ప్రతిపాదించామన్నారు. రూ.వంద కోట్లతో 30 సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటిలో ఎక్కువగా విశాఖ నగరంలో నిర్మాణం అవుతుండగా... నర్సీపట్నంలో కూడా ఒకటి నిర్మాణ దశలో ఉందన్నారు.

లైన్‌మెన్ల నియామకానికి చర్యలు
జిల్లాలో 550 మంది జూనియర్‌ లైన్‌మెన్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. వారు వస్తే సిబ్బంది కొరత తీరుతుందన్నారు. ప్రస్తుతానికి ఏఈల కొరత లేదన్నారు. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒకే ఫీడర్‌ ఉండాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. దీనికిఅనుమతి వస్తే వారికి ప్రత్యేక ఫీడర్‌ ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అనంతరం ఆయన కాకరపాడు వరకు లైన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈ పి. ఆహ్మద్‌ఖాన్, ఏడీఈ లక్ష్మణరావు, నిర్మాణాల డీఈ టీఎస్‌ఎన్‌ మూర్తి, ఏడీఈ అప్పన్నబాబు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు