విద్యుత్ చార్జీల వాతలకు మరో నెల గడువు

28 Nov, 2013 01:44 IST|Sakshi
విద్యుత్ చార్జీల వాతలకు మరో నెల గడువు

ఈఆర్‌సీని కోరిన డిస్కంలు
 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీ ఈఆర్‌సీ)ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కోరాయి. ఈ మేరకు ఈఆర్‌సీ కార్యదర్శికి తాజాగా లేఖ రాశాయి. 2014-15లో ఎంత మేర లోటు ఏర్పడుతుందనే అంశంపై డిస్కంలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. దీని ప్రకారం ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు లోటు ఉంది. ఈ మొత్తాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేయాల్సి ఉంది.
 
  ప్రభుత్వం ఇప్పటికే వరుసగా నాలుగేళ్ల నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు సర్దుబాటు చార్జీలు వడ్డించటంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఎన్నికల సమయంలో చార్జీలు పెంచితే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేమనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో లోటు తగ్గించే అవకాశాలను పరిశీలించడంతోపాటు భారాన్ని తగ్గించేందుకు వీలుగా మరో నెల సమయాన్ని కోరినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31 నాటికి విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంలు కోరాయి. ఒకవేళ ఆ గడువు నాటికి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్‌సీ సుమోటోగా చార్జీలను నిర్ణయించనుంది.

మరిన్ని వార్తలు