పోలీసులకు ముచ్చెమటలు

17 Oct, 2014 03:17 IST|Sakshi

పలమనేరు : పలమనేరు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ వద్ద తుపాను బాధితుల సహాయార్థం రాజకీయ పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో గు మ్మికూడి ఉన్నారు. ఇదే అదునుగా ఓ గజదొంగ పోలీసుల కన్నుగప్పి స్టేషన్ నుంచి పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు గుడియాత్తం రోడ్డులో పట్టుకున్నారు. ఏదేమైనా అరగంట పాటు ఆ దొంగ పోలీసులకు ముచ్చెటమలు పట్టించాడు.

ఈ ఘటన గురువారం పలమనేరు పోలీస్‌స్టేషన్ వద్ద కలకలం రేపింది. స్థానిక దోరణాల చెంగన్న వీధిలో బుధవారం రాత్రి ఓ ఇంటి వద్ద ఆపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఓ వ్యక్తి చోరీచేసి తీసుకెళ్తుండగా స్థానికు లు పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. విచారించగా కర్ణాటక రాష్ట్రంలోని కోలారుకు చెందిన బాషా గా తేలింది. ఇప్పటికే పలు బైక్ చోరీ కేసుల్లో ఇతను సిద్ధహస్తుడని తెలిసింది. పోలీసులు అతని కాళ్లకు బేడీలు (లీడింగ్‌చైన్) వేసి జాగ్రత్తగా వ్యవహరించారు.

గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్‌స్టేషన్ వద్ద తుపాను బాధితులకు విరాళాల సేకరణ నిమిత్తం జనం రద్దీగా ఉన్నారు. ఈ సమయంలో ఆ దొంగ పోలీస్‌స్టేషన్‌కు పడమటి వైపు ఉన్న ఎస్‌బీ రూమ్ పక్కగా వెళ్లి ప్రహారీ గోడ దూకి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న చర్చి గేటును సైతం దూకి గుడియాత్తం రోడ్డులోకి వెళ్లిపోయాడు.

దొంగ స్టేషన్ నుంచి పరారైనట్టు గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నలు మూలలకు పరుగులు తీశారు. ఇంతలో గుడియాత్తం రోడ్డు వద్ద కాళ్లకు బేడీలున్న వ్యక్తి ఉండడంతో స్థానికులు అక్కడ గుమికూడి ఉన్నారు. వెంటనే పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారు. కాళ్లకు లీడింగ్ చైన్ ఉన్నప్పటికీ దొంగ ప్రహరీ గోడలు దూకి పరారీకి యత్నించడం ఆశ్చర్యం కలిగించింది.
 

>
మరిన్ని వార్తలు