18 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె!

29 Jan, 2014 02:33 IST|Sakshi
18 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె!

సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయకపోతే వచ్చే నెల 18 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వర్తించాల్సిన వేతన సవరణ కోసం ఇప్పటికీ కమిటీ వేయకుండా ప్రభుత్వం, యాజమాన్యం జాప్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) మండిపడింది. వెంటనే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో మంగళవారం వందలాదిమంది ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు.
 
 అనంతరం ఉన్నతాధికారులకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జె. సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు, కో చైర్మన్ జి.మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. వాస్తవానికి విద్యుత్ సంస్థల్లో వేతన సవరణకు ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పారు. వేతన సవరణను ఆలస్యం చేసేందుకే అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం అంటోందని ఆరోపించారు. వేతన సవరణకు గత నవంబర్‌లోనే కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.కిరణ్, సంయుక్త కార్యదర్శి ఎంఏ వజీర్, నేతలు చంద్రుడు, భానుప్రకాశ్ తదితరులు తెలిపారు. కాగా, ధర్నా సందర్భంగా తెలుగుతల్లి బొమ్మ ఉన్న సమైక్యాంధ్ర ఫ్లెక్సీని చించేశారని ఇది తెలుగు జాతిని అవమానించడమేనని, ఇందుకు జేఏసీ నాయకత్వం క్షమాపణలు చెప్పాలని జాక్ వైస్ చైర్మన్ గణేష్ డిమాండ్ చేశారు. జేఏసీలో తెలంగాణ ప్రాంతంవారు మాత్రమే ఉన్నారని ఆయన విమర్శించారు.

>
మరిన్ని వార్తలు