కమిషనర్‌కే సర్వాధికారాలు

21 Dec, 2014 02:19 IST|Sakshi

 సీఆర్‌డీఏ కమిషనర్‌కు విశేషాధికారాలు కల్పించిన ఏపీ ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ప్రాంతం లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్‌కు విశేష అధికారాలను కల్పించారు. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లులో తగిన సెక్షన్లను పొందుపరిచారు. కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. కమిషనర్‌పై ఏదైనా దావా, అప్పీలు, దరఖాస్తు లేదా నిషేధాజ్ఞ లేదా ఏదేని సహాయమునకై ఏ న్యాయస్థానం స్వీకరించరాదని బిల్లులో పేర్కొన్నారు. ప్రాధికార సంస్థ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత గృహాల్లోగానీ, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో సైతం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులకు అనుమతించే అధికారం స్థానిక సంస్థలు గానీ ఇతర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు ఉండదని స్పష్టం చేశారు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్లపాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అయితే ఏదైనా భవనం, భూమిలో మార్పు లేకుండా నిర్వహణ పనులను  కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ అవసరాలకు బావులు, బోర్లు, అలాగే మెటల్ లేని రోడ్లు నిర్మాణాలను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధించనున్నారు. అనధికారిక నిర్మాణాల పనులను నిలుపుదల లేదా సీల్ చేసే అధికారం  కమిషనర్‌కు అప్పగించారు. ఏదైనా నిర్మాణం తొలగించినా సంబంధిత వ్యక్తి ఎటువంటి పరిహారం కోరరాదు. కమిషనర్ ఆదేశాలిచ్చిన పక్షం రోజుల్లోగా  ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కోర్టులు ఎటువంటి సూట్, అప్పీల్స్‌ను పరిగణనలోకి తీసుకోరాదు. కమిషనర్ ఆదేశాలే సుప్రీంగా ఉండేందుకే కోర్టుల జోక్యం లేకుండా చట్టంలో సెక్షన్లను పొందుపరిచారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా జిల్లా జడ్జి లేదా సిటీ సివిల్ కోర్టు జడ్జిగా ఉన్న లేక పదవీ విరమణ చేసిన వ్యక్తిని నియమిస్తారు. మరో ఇద్దరిని సభ్యులుగా నియమిస్తారు.
 

మరిన్ని వార్తలు