‘ఎర్ర’ స్మగ్లర్లపై ‘టాస్క్‌‘ఫోర్స్’

19 Nov, 2014 01:25 IST|Sakshi
‘ఎర్ర’ స్మగ్లర్లపై ‘టాస్క్‌‘ఫోర్స్’

  ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసే యత్నం
  స్మగ్లర్లపై కేసు నమోదు, దర్యాప్తు అధికారాలు కూడా టాస్క్‌ఫోర్స్‌కే
  వారం రోజుల్లో వెలువడనున్న జీవో
  అటవీ చట్టం సవరణ..  అవసరమైతే ఆర్డినెన్స్ జారీకి యత్నాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు, అటవీ శాఖలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారాన్ని కూడా ఇవ్వనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) జారీ చేసి దర్యాప్తు చేపట్టి, కోర్టులో అభియోగపత్రాలు సైతం దాఖలు చేసే బాధ్యతలు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కే అప్పజెప్పనున్నారు. ప్రత్యేక విధుల కోసం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడం ఇదే తొలిసారి. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లలో టాస్క్‌ఫోర్స్‌లు ఉన్నాయి. వీటికి కేసులు నమోదు చేసే అధికారం లేదు. కేవలం అసాంఘిక శక్తులు, నేరగాళ్లపై నిఘావేయడం, వారి కార్యకలాపాలను నిరోధించడం వీటి ప్రధాన విధి. అవసరమైతే దాడులు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడం వీటి బాధ్యత. అదుపులోకి తీసుకున్న నిందితులను సంబంధిత పోలీసులకు అప్పజెప్పడంతో వీటి విధులు ముగుస్తాయి. నిందితుపై కేసుల నమోదు, అరెస్టు, దర్యాప్తు, ఇతరత్రా వ్యవహారాలన్నీ పోలీసులే చేపడతారు. దీనివల్ల నేరగాళ్లపై ఆరోపణలు రుజువుకావడంలేదు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఏర్పాటు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు అక్రమ రవాణా నిరోధమే కాకుండా, స్మగ్లర్లను పట్టుకోవడం, కేసుల నమోదు, దర్యాప్తు అధికారాలనూ ఇస్తున్నారు.

ఆధారాలను సేకరించి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలను సైతం టాస్క్‌ఫోర్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల స్మగ్లర్ల కట్టడితో పాటు వారిపై నేరాల్ని నిరూపించవచ్చని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ మేరకు పలు కీలకాంశాలతో కూడిన ప్రతిపాదనల్ని రాష్ట్ర పోలీసు విభాగం ప్రభుత్వానికి పంపింది. దీనిపై సర్కారు వారం రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లును పోలీసు విభాగం న్యాయ శాఖకు పంపింది. టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడానికి అటవీ చట్టం సవరణ అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు న్యాయశాఖకు పంపిన బిల్లులో పొందుపరిచారు. శీతాకాల సమావేశంలో ఇది చట్టంగా మారే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారడానికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో ఆర్డినెన్స్ జారీ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఈ టాస్క్‌ఫోర్స్‌కు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. పోలీసు, అటవీ శాఖలకు చెందిన దాదాపు రెండు వేల మంది సిబ్బందిని దీనికి కేటాయించనున్నారు. పెద్ద మొత్తంలో సిబ్బంది ఉండటం వల్ల కేసుల దర్యాప్తు పెద్ద కష్టం కాబోదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు