రహదారుల్లో పీపీపీ

13 Mar, 2015 04:32 IST|Sakshi
రహదారుల్లో పీపీపీ
  • రోడ్లు, భవనాలకు 2,960 కోట్లు
  •  పీపీపీ ద్వారా రెండు వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి చర్యలు
  •  ఆర్‌అండ్‌బీకి గత బడ్జెట్ కంటే ఈసారి రూ.348 కోట్లు అదనం
  •  మౌలిక సదుపాయాల రంగానికి రూ.195 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి(పీపీపీ)లో రాష్ట్రంలో రెండు వేల కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు ట్రాన్సాక్షన్ అడ్వయిజరీ కన్సల్టెంట్లను నియమించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ మేరకు వెల్లడించింది.

    బడ్జెట్‌లో ఆర్‌అండ్‌బీకి రూ.2,960 కోట్లను కేటాయించారు. అయితే రోడ్లను అభివృద్ధి చేస్తామని పదే పదే చెబుతున్న సర్కారు.. అందుకు తగ్గట్లుగా కేటాయింపులు జరపలేదు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు, నాలుగు లేన్ల రోడ్లు నిర్మిస్తామని, రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. గతేడాది ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కంటే ఈసారి రూ.348 కోట్లు మాత్రమే అధికంగా కేటాయింపులు జరిపింది. పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది.

    జల, వాయు, భూ మార్గాల రవాణా వ్యవస్థను విస్తరించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆర్‌అండ్‌బీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు కలిపి మొత్తం రూ.3,152 కోట్లను కేటాయించారు. ఇందులో ప్రణాళికేతర పద్దు కింద రూ.1,117 కోట్లు ప్రతిపాదించారు. ప్రణాళిక పద్దు కింద మౌలిక సదుపాయాలకు రూ.2,035 కోట్లు, పెట్టుబడులకు రూ.195 కోట్లు కేటాయించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, సహజ వాయువు సంబంధిత అంశాలను మౌలిక సదుపాయాల విభాగంలో చేర్చారు.

    ఈ రంగంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని కీలకం చేశారు. కాకినాడ, యాంకరేజీ పోర్టు, డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం, రవ్వలో కేపిటల్ పోర్టు విస్తరణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మచిలీపట్నం లో నౌకాశ్రయాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. భావనపాడు, కళింగపట్నం, నరసాపురంతో పాటు 14 మైనర్ పోర్టులు విస్తరణ ప్రణాళికలకు నిధులు కేటాయించారు.

    విజయవాడ, రాజమండ్రి, తిరుపతిల లో విమానాశ్రయాల విస్తరణ, ఆధునీక రణకు ఎయిర్ ఇండియా చర్య లు చేపట్టనుంది. బడ్జెట్‌లో రాజ మండ్రి విమానాశ్రయానికి రూ.10 కోట్లు, తిరుపతికి రూ.30 కోట్లు కేటాయించారు. విజ యవాడ విమానాశ్రయానికి రూ.36 కోట్లు కేటాయించారు. కాకినాడ ఓడరేవు విస్తరణకు రూపొందిం చే ప్రణాళికలకు రూ.65 లక్షలు ప్రతిపాదించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా (50 శాతం) కోసం రూ.88 కోట్లు కేటాయించింది.
     
    రవాణా శాఖకు రూ.122 కోట్లు

    బడ్జెట్‌లో రవాణా శాఖకు రూ.122 కోట్లు కేటాయించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ లెర్నర్ లెసైన్సు పొందేటప్పుడు రహదారి భద్రతపై పరిజ్ఞానం తప్పనిసరి చేసినట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. రహదారి భద్రతకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో త్వరలో పైలట్ పథకం చేపట్టనున్నారు. ఆర్‌అండ్‌బీ, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖల సహకారంతో రేణిగుంట నుంచి రాయలచెరువు వరకు ఇప్పటికే ఓ డెమో కారిడార్ చేపట్టారు.

మరిన్ని వార్తలు