న్యాయ పరిరక్షణలో పీపీలే కీలకం

24 Jan, 2016 05:02 IST|Sakshi
న్యాయ పరిరక్షణలో పీపీలే కీలకం

జస్టిస్ ఎన్‌వీ రమణ
సాక్షి, విజయవాడ: న్యాయాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ న్యాయవాదులు కీలకభూమిక పోషించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన ‘అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ తొలి సమావేశంలో జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... ప్రజలకు న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఏపీపీలు (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు), న్యాయమూర్తులు వమ్ము చేయవద్దన్నారు.

నిందితులకు శిక్ష పడటం అవసరమేనని, కానీ ఏపీపీలు తమ పరిధులు దాటవద్దన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ బాధితులకు న్యాయంచేయాల్సిన బాధ్యత ఏపీపీలపై ఉందన్నారు. న్యాయ విచారణ ప్రాథమిక హక్కుగా గతం లో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు. హత్యలు, దోపిడీ, అత్యాచారాలు తదితర నేరాల్లో శిక్షలు తక్కువగా పడుతున్నాయన్నా రు. సత్వర న్యాయం జరగకపోతే బాధితులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.  
 
న్యాయవాదిగా ఉన్న రోజుల్లో...
తాను న్యాయవాదిగా ఉన్న రోజుల్లో అయ్యప్పరెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశానని, ఒక కేసుకు ఇద్దరం హాజరుకాగా, ఏపీపీ కేసును సరిగా వాదించకపోవడాన్ని ఆయన తన దృష్టికి తీసుకువచ్చారని జస్టిస్ రమణ తెలిపా రు. అదే సందర్భంలో అయ్యప్పరెడ్డి తన అనుభవాన్ని నాకు చెబుతూ ‘ఒక కేసులో డిఫెన్సు న్యాయవాదిగా బాగా వాదించానని, అయితే ఏపీపీ వచ్చి ఈ కేసు నువ్వు గెలుస్తావా.. అని నన్ను ప్రశ్నించారు. నేను తప్పకుండా గెలుస్తానని చెప్పగా, ఏపీపీ తన జేబులోంచి ఒక కాగితం నాకు ఇచ్చారు. ఈ రోజు ‘బండెడు కట్టెలు’ పంపమని న్యాయమూర్తి పబ్లిక్ ప్యాసిక్యూటర్‌కు రాసిన చీటి అది. దీం తో కొద్దిగా నిరాశకు లోనైనా కేసు మాత్రం గెలిచా’ అని అయ్యప్పరెడ్డి వివరించినట్లు జస్టిస్ రమణ వెల్లడించారు.
 
దక్షిణాదిలోనే కేసులు వేగవంతం...
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలోనే కేసులు వేగవంతంగా నడుస్తున్నాయని జస్టిస్ రమణ తెలిపారు. తాను సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఈ రెండేళ్ల కాలంలో 1984 నాటి కేసులు ఇప్పటికీ విచారణకు వస్తున్నాయన్నా రు. తెలుగు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్ని ఏడాది నుంచి మూడేళ్లులోపు పరిష్కారిస్తున్నారని తెలిపారు. జస్టిస్ జి.భవానీప్రసాద్, లా సెక్రటరీ దుర్గాప్రసాద్, ఇన్‌చార్జి డెరైక్టర్‌ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సీసీ సుబ్రహ్మణ్యం, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు