వంట వండి.. ఇస్త్రీ చేసి..!

3 Jun, 2014 02:40 IST|Sakshi

కల్లూరు రూరల్ (కర్నూలు), న్యూస్‌లైన్ : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా కర్నూలు నగరం ఏపీఎస్‌పీ క్యాంప్‌లో ట్రేడ్‌మన్ అభ్యర్థుల ఎంపికకు సోమవారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నైపుణ్యాన్ని పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా.. లేదా..? అని పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరుకాగా జూలై 27వ తేదీ వీరికి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కల్నల్ జాఫ్రి తెలిపారు.

 సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్‌మన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందని చెప్పారు. అయితే, ఈ నెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, వాటిని మంగళవారం నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ముగుస్తుందని జాఫ్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు