ప్రగతే లక్ష్యం కావాలి

20 Jun, 2014 01:29 IST|Sakshi
ప్రగతే లక్ష్యం కావాలి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు విద్య, క్రీడలు, సాంస్కృతికం, సాహిత్యం.. ఇలా వివిధ రంగాల్లో ఎంతోమంది మేరునగధీరులు జిల్లా పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తం చేశారు. ఎన్నో విషయాల్లో ఘనమైన చరిత్ర గల ఈ జిల్లా.. అభివృద్ధి విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. పది నియోజకవర్గాల్లో ఏడింట తెలుగుదేశం విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
 
 పస్తుతం తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లండి.. అసెంబ్లీలో మా వాణి గట్టిగా వినిపించండి..ఇక్కడి సమస్యలు ప్రభుత్వానికి విన్నవించండి..’ అని జిల్లా వాసులు శాసనసభ్యులకు వేడుకుం టున్నారు. ‘ముఖ్యమంత్రి సహా నేతలందరూ విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలపైనే దృష్టి సారిస్తున్నారు.. శ్రీకాకుళం లాంటి పట్టణాలనూ అభివృద్ధి చేసేలా వారిపై ఒత్తిడి తెండి’ అని కోరుతున్నారు. మంత్రి పదవి దక్కించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడుపై మరింత బాధ్యత ఉందని అంటున్నారు.
 
 ఈ పనులు పూర్తి చేయించండి..
 గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే వంశధార రెండో దశ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2009 తర్వాత వాటిని పట్టిం చుకోలేదు. సుమారు రూ.933 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా రైతుల కడగండ్లు చాలావరకు తీరతాయి.  పలాస ప్రాంతంలో చేపట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నారాయణపురం కాలువ, తోటపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. వర్షాల సీజన్ వచ్చేసింది. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నదులకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలి.  సీతంపేట, భామిని, కొత్తూరు, పాల కొండ, పాతపట్నం, సారవకోట, మెళియాపుట్టి, మందస వంటి ప్రాంతాలు జిల్లాలో గిరిజన, సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం సహా ఉపాధి శిక్షణ కేంద్రాలు ఈ ప్రాంతాల్లో నెలకొల్పితే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలి.
 
   పైడి భీమవరం, రాజాం, టెక్కలి ప్రాం తాల్లో పరిశ్రమలున్నాయి. అయినా జిల్లా వాసులకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పవర్ హాలిడే తప్పించడంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తగిన సదుపాయాలు కల్పించాలి.   జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించకపోవటంతో అవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వందలాది ట్రాక్ట ర్ల ఇసుక అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయల మేర గండి పడుతోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలి.
 
   జిల్లాలో సుమారు 176 కి.మీ పొడవున తీర ప్రాంతం ఉంది. భావనపాడులో హార్బ ర్ నిర్మిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదు. కళింగపట్నం, శాలిహుండం, దంతవరపుకోట, బారువ వంటి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి వెనకబడిపోయింది.  పేరుగాంచిన ఉద్దానం కొబ్బరి పంటకు ప్రోత్సాహం కరువైంది. ఈ ప్రాంతంలో కాయిర్ పరిశ్రమ ఏర్పాటైతే ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. రక్షిత తాగునీటి కోసం ఉద్దాన ప్రాంత వాసులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తు ల్ని ఆదుకునేందుకు డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.
 
   నాగావళి నదిపై వీరఘట్టం మండలం కిమ్మి, వంగర మండలం రుషింగి గ్రామాల మధ్య, శ్రీకాకుళం పొన్నాడ వద్ద, శ్రీకాకుళంలోని పాత వంతెన వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణ  పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉంది.  జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెల కొన్న సమస్యల కారణంగా రోగులు అవస్థలు పడుతున్నారు. మెరుగైన వైద్యం ఇక్కడ ఎండమావే. వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి.   ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్న టీడీపీ హామీ నెరవేరేలా చూడాలి.  ప్రతి మండలంలోనూ మినీ స్టేడియం నిర్మించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలి.
 

మరిన్ని వార్తలు