సంకల్పం చారిత్రాత్మకం

29 Jul, 2018 07:00 IST|Sakshi

పాదయాత్ర 100 నియోజకవర్గాలు..

 2600 కిలోమీటర్లు పూర్తి

 కేక్‌ కట్‌ చేసి.. మొక్క నాటిన జగన్‌ 

బహిరంగ సభకు పోటెత్తిన జనవాహిని 

సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభమైన జననేత సంకల్ప యాత్ర చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునేలా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్నాయి. మూడు వేల కిలోమీటర్ల లక్ష్యంతో మొదలైన పాదయాత్ర ఇప్పటికే పలు మైలురాళ్లను దాటింది. తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో ఒకే రోజు రెండు మైలురాళ్లు చరిత్రలో లిఖించబడ్డాయి. 

జగ్గంపేటలో పాదయాత్ర అడుగిడడంతో 100 నియోజకవర్గాలు పూర్తి చేసుకోవడంతోపాటు 2600 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కాట్రావులపల్లి జంక్షన్‌లో సర్వ మత ప్రార్థనలు జరిగాయి. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, పాస్టర్లు ప్రార్థనలు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడే అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను వైఎస్‌ జగన్‌ కట్‌ చేశారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, తీన్‌మార్‌ డప్పులతో జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు భారీ జన సందోహంతో ఘన స్వాగతం పలికారు.

దారిపొడవునా తన కోసం వేచియున్న అక్కచెల్లెమ్మలు, అవ్వా, తాతలు, చిన్నారులను పలకరిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. పంట చేలలో పని చేస్తున్న రైతన్నలు, రైతు కూలీలు తన కోసం పరిగెడుతూ వస్తున్న దృశ్యాన్ని చూసిన జగన్‌ వారు వచ్చే వరకు ఆగి పలకరించారు. వారి కష్టాలు, సేద్యంలో సమస్యలు విన్న జగన్‌ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. సాయంత్రం జగ్గంపేట వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర 2600 కిలోమీటర్లు పూర్తి కావడంతో పట్టణంలో వైఎస్‌ జగన్‌ మొక్కనాటారు. అనంతరం బస్‌స్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభకు చేరుకున్నారు. 

222వ రోజు 10 కిలోమీటర్లు.. 
ప్రజా సంకల్ప యాత్ర 222వ రోజు 10 కిలోమీటర్ల మేర సాగింది. పెద్దాపురం నియోజకవర్గం నుంచి శనివారం పాదయాత్ర జగ్గంపేట నియోజకవర్గంలోకి అడుగిడింది. ఉదయం రాత్రి బస కేంద్రం వద్ద ప్రారంభమైన పాదయాత్ర తిమ్మాపురం, కాట్రావులపల్లి జంక్షన్, సీతానగరం జంక్షన్‌ మీదుగా జగ్గంపేటకు చేరుకుంది. దారిపొడవునా అక్కాచెల్లెమ్మలు హారతులు పట్టి తమ అభిమాన నేతకు వీరతిలకం దిద్దారు. పిల్లలతో వచ్చిన దంపతులు, యువత, అక్కాచెల్లెమ్మలు జననేతతో సెల్ఫీల కోసం పోటీ పట్టారు. బహిరంగ సభ అనంతరం యువత జైæ జగన్‌ అంటూ నినదిస్తూ వైఎస్‌ జగన్‌ వెంట పరుగులు తీసింది. 

వెల్లువలా వినతులు..
పాదయాత్రలో పలువురు తమ సమస్యలు, కష్టాలపై వైఎస్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. బీసీ–డీ లో ఉన్న తమ సామాజికవర్గాన్ని బీసీ–ఏలో కలపాలని సగర సామాజికవర్గీయులు వైఎఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ జాప్యంతో ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామని అభ్యర్థులు వాపోయారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరినందుకు పెద్దాపురం మున్సిపల్‌ ఆఫీసు ఎదరుగా ఉన్న తన మామయ్యకు చెందిన మూడు సెంట్ల స్థలాన్ని టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్‌ పేరుతో అన్యాయంగా తీసుకున్నారని 12వ వార్డు మాజీ కౌన్సిలర్‌ యాకోబు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50 లక్షల విలువైన స్థలంపై ప్రశ్నిస్తే తనతోపాటు 12 మందిపై అక్రమ కేసులు బనాయించారని ఫిర్యాదు చేశారు. అందరి సమస్యలూ విన్న వైఎస్‌ జగన్‌ పరిష్కారంపై భరోసా ఇస్తూ ముందుకు సాగారు. 

పాదయాత్రలో పార్టీ శ్రేణులు...
పాదయాత్ర, బహిరంగ సభలో శనివారం పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులను త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు జ్యోతుల చంటిబాబు, తోట సుబ్బారావునాయుడు, రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, అనంత ఉదయ్‌ భాస్కర్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పార్టీ నేతలు దవులూరి దొరబాబు, పితాని అన్నవరం, కొల్లి నిర్మల కుమారి, విప్పర్తి వేణుగోపాల్, సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాము సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

ఫిరాయింపుదారులపై చర్నాకోలా..
అభివృద్ధి కోసమంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఏమిటంటూ చర్నాకోలాతో కొట్టినట్లుగా బహిరంగ సభలో పదునైన పదాలతో వారి తీరును ఎండగట్టారు. సంతలో పశువులను కొన్నట్టుగా అధికార పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, అభివృద్ధి కోసం మారామని చెప్పుకున్న నాయకులు చేసిన అభివృద్ధి మీకు ఏమైనా కనిపిస్తోందా? అని ప్రశ్నించడంతో అశేష జనవాహిని.. ‘లేదు.. లేదు..’ అంటూ జవాబిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన డిగ్రీ కళాశాల భవన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 

జగ్గంపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తామన్న హామీ నెరవేర్చకపోగా 30 పడకల ఆస్పత్రిలో 15 బెడ్లు మాత్రమే ఉన్న దుస్థితి నెలకొందని పాలకుల తీరును ఎండగట్టారు. తాటిచెట్టు లోతున చెరువులు తవ్వి మట్టి దోచుకుంటున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదులను సభలో వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. చెరువులు తవ్వేందుకు రూ.9 కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకుని, తవ్విన మట్టిని అంతకు రెట్టింపు మొత్తానికి అమ్ముకున్నారని గుర్తు చేశారు.

 వైఎస్‌ హాయంలో నియోజకవర్గంలో 18,600 ఇళ్లు నిర్మిస్తే, నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో ఒక్క ఇళ్లు కూడా కట్టని తీరును దుయ్యబట్టిన సమయంలో సభికులు హర్షధ్వానాలు చేశారు. అబద్ధాలు, మోసాలు తాను చేయలేనని, చేయగలిగిన పనులే తాను చెబుతానంటూ, మాట తప్పనని వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించిన సమయంలో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో అబద్ధాలు చెప్పిన వాళ్లను, మోసం చేసిన వాళ్లను బంగళాఖాతంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని, రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయతీని తీసుకొచ్చేందుకు తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు