సాగర నగరికి ఇది శుభోదయం

8 Sep, 2018 08:02 IST|Sakshi
కొత్తపాలెం వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కటౌట్‌తో ఏర్పాటు చేసిన ముఖద్వారం

నేడు నగరంలో అడుగిడనున్న జన హృదయ నేత

అపూర్వ స్వాగతం పలికేందుకు విశాఖ వాసుల నిరీక్షణ

విశాఖ దశ.. దిశను మార్చిన రాజన్న పాలన

అభివృద్ధికి బాటలు వేసిన మహానేత

నేడు అవినీతి, అక్రమాలు, భూకబ్జాల కేంద్రంగా మారిన మహా విశాఖ

మళ్లీ రాజన్న పాలనకై విశాఖవాసుల తహతహ

జననేతకు అండగా నిలిచేందుకు సన్నద్ధం

గ్రామీణం గుండెకు హత్తుకుంది.. నగరం అక్కున చేర్చుకోనుంది. జనం కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు బహుదూరపు బాటసారిలా నడచి వస్తున్న నిరంతర పథికుడి అడుగుల్లో అడుగులు వేయడానికి విశాఖ ప్రజలు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రజాకంటక పాలనపై సమరభేరి మోగిస్తూ కన్నీళ్లు తుడిచేందుకు కదలివస్తున్న జన హృదయ నేతకు అపూర్వ స్వాగతం పలికేందుకు మహానగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిటీలో తొలి అడుగుపెట్టే కొత్తపాలెం ప్రాంతం సగర్వంగా ముస్తాబైంది. శనివారం పాదయాత్ర సాగే దారుల్లో అడుగడుగునా స్వాగత ద్వారాలు, భారీ ఫ్లెక్సీలు, వైఎస్సార్‌సీపీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు.

సాక్షి, విశాఖపట్నం: ఎండనక.. వాననక తమ కష్టాలు తీర్చేందుకు వజ్రసంకల్పుడై వస్తోన్న జననేత అడుగులో అడుగు వేసేందుకు విశాఖవాసులు ఉవ్విళ్లూరుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యమాలే ఊపిరిగా సాగుతున్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం నగరంలో అడుగుపెట్టనున్నారు. జననేత రాక కోసం ఓ పక్క పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తుంటే.. మరో ప్రక్క స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు విశాఖ వాసులు ఉద్యుక్తులవుతున్నారు. గత నెల 14వ తేదీన గన్నవరం మెట్ట వద్ద ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టిన ఈ మహాయాత్ర అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల మీదుగా సాగింది. జిల్లాలో 188.6 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో ఎన్నో మైలురాళ్లు.. మరెన్నో రికార్డులు నమోదయ్యాయి. గ్రామీణ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని శనివారం విశాఖలో ప్రవేశిస్తుంది. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం, నరవ, బాట్లింగ్‌ కాలనీ, ఎస్సీ కాలనీ, పెదనరవ, కోట నరవ కాలనీ మీదుగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 66వ వార్డు పరిధిలోని కొత్తపాలెం వద్ద మహా విశాఖ నగరంలోకి అడుగుపెట్టనుంది. అక్కడ నుంచి భగత్‌సింగ్‌ నగర్,  కార్వెల్‌ నగర్, సాయినగర్, అప్పల నరసయ్య కాలనీ, నాగేంద్రకాలనీ,గణపతినగర్, శ్రీరామ్‌నగర్‌ మీదుగా గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్‌ వరకు సాగనుంది.

విశాఖ మదిలో రాజముద్ర
మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి.. మహా విశాఖ నగరానికి విడదీయరాని బంధం ఉంది. విశాఖ అభివృద్ధి కోసం చెప్పాల్సివస్తే వైఎస్‌కు ముందు.. ఆ తర్వాత అని చెప్పక తప్పదు. విశాఖ దశ.. దిశను మార్చిన మహానేత ఆయన. ఆ ఐదున్నరేళ్లలో విశాఖపై ఆయన చెరగని ‘రాజ’ ముద్ర వేశారు. సొంత కడప జిల్లా కంటే విశాఖలోనే లెక్కలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా విశాఖవాసుల మది పులకిస్తుంటుంది. మహానేత దయ వల్ల మహా విశాఖగా మారిన విశాఖలో 2004–09 మధ్యలో జరిగినన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరే ముఖ్యమంత్రి హయాంలోనూ జరగలేదనే చెప్పొచ్చు. రూ.1500 కోట్లతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టు కింద భూగర్భ డ్రైనేజీ, రూ.456 కోట్లతో బీఆర్‌టీఎస్‌ రహదారి, పూర్‌ షెటిల్‌మెంట్, పునరావాస కాలనీల పేరిట పేదలకు లక్ష గృహాలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు మదిలో తొణికిసలాడుతున్నాయి. అదే విధంగా రూ.12,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్‌ విస్తరించినా, మూత పడనున్న బీహెచ్‌ఈఎల్‌ను బీహెచ్‌పీవీలోకి విలీనం చేసినా.. షిప్‌యార్డును నేవీలోకి విలీనం చేయించినా.. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ విస్తరణకు పునాదులు వేసినా ఆయన చలవే. ఆరిలోవలో హెల్త్‌ సిటీ, పరవాడలో ఫార్మాసిటీ, మధురవాడలో ఐటీ కారిడార్, దువ్వాడలో ఐటీ సెజ్, అచ్యుతాపురంలో ఎస్‌ఈజెడ్‌లతోపాటు విశాఖ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్‌ హయాంనాటి సువర్ణయుగం ప్రజల మనో ఫలకంపై కదలాడుతుంటుంది.

టీడీపీ పాలనలో అంతా దోపిడీ రాజ్యమే
గడిచిన నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో విశాఖ నగరం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. భూకబ్జాలకు కేంద్రంగా మారింది. రౌడీలకు ఆలవాలంగా మారింది. ఎటు చూసినా దోపిడీలు.. దౌర్జన్యాలే.  చినబాబుకు ఏజెంట్లుగా మారి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కన్పించిన భూమినల్లా కబ్జాలు చేస్తూ దోచుకోవడమే పరమావధిగా పాలన సాగిస్తున్నారు. టీడీపీ పాలనలో విశాఖకు ఈ దుర్గతి పట్టిందని మధనపడని వారు లేరు. టీడీపీ అధికారంలోకి రాగానే భాగస్వామ్య సదస్సులు, ఉత్సవాలు, సంబరాల పేరిట వందల కోట్ల ప్రజాధనం లూటీ చేయడం, రికార్డులు మార్చి, రిజిస్ట్రేషన్లు చేయించి లక్ష ఎకరాలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు కాజేయడం తప్ప మచ్చుకైనా అభివృద్ధి జాడలేని పరిస్థితి. విశాఖ బతకాలంటే  సామాన్య, మధ్యతరగతి ప్రజలు భద్రత లేని దుస్థితి కల్పించారు. ప్రతి ఒక్కరూ మళ్లీ నాటి రాజన్న పాలన రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. రాజన్న రాజ్యం జగనన్న తోనే సాధ్యమన్న భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖలో అడుగుపెడుతున్న రాజన్న ముద్దుబిడ్డకు అండగా నిలవాలని విశాఖ నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. మళ్లీ అలనాటి పాలన రావాలన్న కాంక్షతో విశాఖవాసులు జననేతకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

స్వాగతానికి ఏర్పాట్లు
నగరంలో అడుగిడుతున్న జననేతకు అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ ఆధ్వర్యంలో పలు దఫాలు పార్టీ కో ఆర్డినేటర్లు ముఖ్యనేతలతో భేటీ అయి ఏర్పాట్లను సమీక్షించారు. అంతేకాదు 9వ తేదీన కంచరపాలెం మెట్ట వద్ద జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. మరోపక్క కొత్తపాలెం వద్ద నగరంలో అడుగుపెడుతున్న జననేతకు ఘన స్వాగతం పలికేందుకు విశాఖ పశ్చిమ కో ఆర్డినేటర్, పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ నాయకత్వంలో 66వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్, ఆల్ఫా కృష్ణ, కలిదిండి బద్రినాథ్, జియ్యాన్‌ శ్రీధర్, చొక్కా ప్రసాదరెడ్డి, ఆడారి శ్రీను తదితరులు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జననేత సమరశంఖం పూరిస్తున్న కటౌట్‌తో కొత్తపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక దారిపొడవునా ఇరువైపులా భారీ ఫ్లెక్లీలు, బ్యానర్లు, తోరణాలతో నింపేశారు. విశాఖ నగరంలో అడుగుపెడుతున్న జననేతకు అపూర్వ సాగతం పలకడమే కాదు.. ఆయన అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కేందుకు వేలాదిమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ అన్నారు.

మరిన్ని వార్తలు