ప్రజా సంకల్ప సంబరాలు..

6 Nov, 2019 12:12 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో సరిగ్గా రెండేళ్లు నిండాయి. ఈ సందర్భంగా  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌లు కేక్‌ కట్‌ చేశారు. 

రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో చేపట్టిన చరిత్రాత్మక  పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మారథం పట్టిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్‌ రాజ సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 సభల్లో, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన అద్దేపల్లి..
జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. 

చరిత్రలో చూడలేదు.. భవిష్యత్తులో కూడా చూడలేం..
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ నాయకుడు చేయని విధంగా పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. 3,648 కి.మీ సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అధికారంలో వచ్చాక వాటిలో 90 శాతం నెరవేర్చారని తెలిపారు. ఇటువంటి పాదయాత్రను చరిత్రలో చూడలేదని.. భవిష్యత్తులో కూడా చూడలేమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు