దిగ్విజయంగా కొనసాగుతున్న జననేత పాదయాత్ర

15 Dec, 2018 20:24 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : సిక్కోలు ప్రజల ఆశీస్సులతో, అపురూప జనాదరణతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం నియోజకవర్గంలో పూర్తి చేసుకొని నరసన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నియోజకవర్గ ప్రజలు, నేతలు, అభిమానులు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గత నెల 25న శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర  పాలకొండ, రాజాం, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికాం క్రాస్‌ వద్ద ప్రారంభమైన పాదయాత్ర నైరా, కరిమిల్లిపేట క్రాస్‌, రోణంకి, బైరి జంక్షన్‌, కరజాడ, వంశధార ప్రాజెక్ట్‌ మీదుగా కొనసాగి మడపాం సమీపంలో నరసన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, కల్లు గీత కార్మికులు, ఉత్తరాంధ్ర తెలగ కులస్తులతోపాటు పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు, వృద్ధులు జగన్‌ను కలిసి పాదయాత్రకు మద్దతుగా నిలిచారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల, కార్యకర్తల ఆగడాలు భరించలేకపోతున్నామంటూ...వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు ...వైఎస్‌ జగన్ ముందుకు తమ కష్టాలను తీసుకుపోయారు. 321వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ 10.8 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.

శ్రీకాకుళం నియోజకవర్గం సింగిపురం పంచాయితీ మామిడివలస గ్రామానికి చెందిన సత్యనారాయణ కుటుంబసభ్యులు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని చెప్పి అన్యాయంగా టీడీపీ నేతలు తమ స్టోన్‌ క్రషర్‌ని మూయించారని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

322వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌
అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 322వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు ఆదివారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని దేవాది శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొమ్మర్తి, గుండువల్లిపేట, సత్యవరం క్రాస్‌ మీదుగా నరసన్న పేట, జమ్ము వరకు ప్రజాసంకల్పయాత్ర  కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు