విన్నాం.. చూస్తాం..

25 Sep, 2018 12:22 IST|Sakshi

పరిష్కారం లేని..ప్రజావాణి

నామమాత్రంగా అర్జీల స్వీకరణ వినతుల పరిష్కారంపై అశ్రద్ధ

స్పందించని అధికారులురెవెన్యూ వినతులే అధికం

సడలుతున్న నమ్మకం

జనం సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న ‘ప్రజా వాణి’ మొక్కుబడిగా సాగుతోంది. వినతులు తీసుకోవడం, తరువాత బుట్టదాఖలు చేయడం సర్వసా«ధారణమైపోయింది. ఫలితంగా ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్న బాధితుల వేదన అరణ్యరోదనగానే మారుతోంది. జిల్లా స్థాయి అధికారులైనా న్యాయం చేస్తారని వ్యయప్రాయాసలకోర్చి వస్తున్న వారికి నిరాశే మిగులుతోంది.  –చిత్తూరు, సాక్షి

చిత్తూరు, సాక్షి: జిల్లాలో ప్రతి సోమవారమూ  ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయి తీ. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ నేతృత్వంలో వినతులు స్వీకరణ జరుగుతోంది. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశానికి ఆయా శాఖల హెచ్‌వోడీలు, మండల స్థాయిలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలి. చాలాచోట్ల తహసీల్దార్‌ తప్ప ఇంకెవరూ భాగస్వాములు కావడం లేదు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఉంటారన్న భయంతో విభాగాధిపతులు హాజరవుతున్నారు. కొన్ని శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. కిందిస్థాయి సిబ్బంది హెచ్‌వోడీలకు సమస్యలు వివరించే పరిస్థితి ఉండదు. చెప్పినా వింటారనే భావన లేదు. నేరుగా హెచ్‌వోడీలే ప్రజావాణిలో పాల్గొంటే కలెక్టర్‌ దగ్గరే సమస్యపై స్పష్టత వచ్చే వీలుంటుంది. ప్రజావాణికి రాని విభాగాధిపతులకు నోటీసులు జారీ చేస్తే మరో ప్రజావాణికైనా వచ్చే వీలుంటుంది. ప్రజావాణి 11 గంటలు దాటితే కానీ ప్రారంభం కావడం లేదు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. వేదిక మీద కూర్చున్న తర్వాత హడావుడిగా వినతులు స్వీకరిస్తున్నారు. వినతిపత్రం ఇస్తున్న వారితో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు.

రెవెన్యూ శాఖవే ఎక్కువ ఫిర్యాదులు..
రెవెన్యూ శాఖ సమస్యలే ఎక్కువ ఫిర్యాదులుగా వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వారే ప్రతి వారమూ వస్తున్నారు. 
క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటనలు తక్కువ కావడం కూడా దీనికి కారణం.
భూ సరిహద్దులపై స్పష్టత లేకపోవడంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకరి భూ మిలోకి మరొకరు వచ్చారని ఆక్రమించుకుంటున్నారన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. 
క్లిష్టమైన సమస్యలను రెవెన్యూ శాఖ ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి 534 వినతులు వస్తే వాటిలో 73 మాత్రమే పరిష్కారమయ్యాయి.
మిగతా శాఖల్లో ప్రజల నుంచి 50కి మించిన ఫిర్యాదులు రావడం లేదు. కొన్ని ఫిర్యాదులను ప్రజావాణిలో నమోదు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కలెక్టర్‌ వినతులు స్వీకరించే సంప్రదాయం గతంలో ఉండేది. ఇప్పుడది లేదు.
 ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షలు, సమావేశాలు లేకపోవడం వల్ల కూడా పరిష్కారాలు తక్కువ నమోదవుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
హౌసింగ్‌ విభాగంలో 542 వినతులు వచ్చాయి. వీటిలో కేవలం 190 మాత్రమే పరిష్కారమయ్యాయి. 
ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు పరిష్కరించడంలో అ«ధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

సమస్యలు పరిష్కరించడం లేదు
అధికారులు అర్జీలు తీసుకుంటున్నారే గాని సమస్యలు పరిష్కరించడం లేదు. ఏడాదిన్నరగా దారికోసం ఇప్పటికి కలెక్టర్‌కు ఏడుసార్లు విన్నవించాను. పట్టించుకోలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆ అర్జీలు తిరిగి మండల అధికారులకు వస్తున్నాయి. మం డల అధికారులు సమస్యను పరిష్కరించకపోగా దురుసుగా ప్రవరిస్తున్నారు.– టి.రమేష్, ఈఆర్‌ కండ్రిగ, జీడీనెల్లూరు 

లోకేష్‌బాబుది కుప్పం మండలం కొత్తపల్లె. 45శాతం వికలాంగత్వం ఉన్నట్లు సదరం నుంచి ధ్రువీకరణ పత్రం ఉంది. వికలాంగ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాలేదు. కలెక్టరేట్‌కు మూడు సార్లు తిరిగాడు. సోమవారం మళ్లీ అర్జీ ఇచ్చాడు. తన వినతిని పట్టించుకోవడం లేదని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు పింఛను మంజూరు చేయరో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. 

మరిన్ని వార్తలు