కష్టం చెబితే కేసుపెట్టారు!

5 Feb, 2019 07:24 IST|Sakshi
రిటైర్డ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ను స్టేషన్‌కు తీసుకెళ్తున్న మహారాణిపేట పోలీసులు

గోడు చెప్పుకుంటే కలెక్టర్‌ అసహనం

విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్‌పై          చిందులు

కేసు నమోదు చేయాలని డీఆర్‌వోకు ఆదేశం

మహారాణి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

కలెక్టర్‌ తీరుపై  అసంతృప్తి

నా ప్రాధాన్యం ప్రజావాణికే..సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌కు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరు కావాల్సిందే.. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవు.. అని బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ స్పష్టం చేశారు.తొలివారం గ్రీవెన్స్‌సెల్‌ లోచిన్న సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలిచ్చారు.. ఈ వార్త ప్రజలకు చేరడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కా రం కోసం ప్రజలు తరలివస్తున్నా రు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ తరుణంలో సోమవారం కలెక్టర్‌ భాస్కర్‌ ప్రజావాణిలో వ్యవహరించిన తీరుపై అందరి నుంచి అసంతృప్తి
వ్యక్తమయింది.

సాక్షి, విశాఖపట్నం: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో  తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఓ అర్జీదారుడిపై  కలెక్టర్‌ ఏకంగా కేసు నమోదు చేయించారు. రెవెన్యూ శాఖకు చెందిన రిటైర్డ్‌ అధికారిపైనే కలెక్టర్‌ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న అధికారులతో పాటు అర్జీదారులు కూడా విస్తుపోయారు.

ఇదీ పరిస్థితి
సంక్రాంతి తర్వాత బాధ్యతలు చేపట్టిన  కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ గడిచిన మూడు వారాలుగా అన్నీ తానై గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తున్నారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో చెప్పులరిగేలా తిరిగినా  సమస్యలు పరిష్కారం కాని వారంతా మళ్లీ కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. ఈ కారణంగానే  సోమవారం రికార్డుస్థాయిలో 455 మంది  అర్జీదారులు వచ్చారు.

విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్‌పైకేసు నమోదుకు ఆదేశం
కలెక్టరేట్‌లోని యూఎల్‌సీ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి రిటైర్‌ అయిన ఎల్‌.విజయ్‌కుమార్‌ ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్య చెప్పుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. 2013లో రిటైర్‌ అయిన ఈయనకు ఇంత వరకు పదవీవిరమణ ప్రయోజనాలు అందలేదు.  మూడు పీఆర్సీలు అమలు కాలేదు. 13కు పైగా ఇంక్రిమెంట్లు పడలేదు.  దాదాపు ఆరేళ్లుగా పెన్షన్‌ రావడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోలేదు.  కొత్త కలెక్టర్‌కు చెప్పుకుంటే  సమçస్య పరిష్కారమవుతుందన్న ఆశతో విజయ్‌కుమార్‌ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చారు. సమస్య  చెప్పుకోగా.. ఆసాంతం విన్న కలెక్టర్‌ భాస్కర్‌ కొంత సమయం పడుతుంది..అంతతొందరగా అవదు కదా అంటూ బదులివ్వడంతో రిటైర్డ్‌ డీటీ కాస్త ఆవేదనతో తన గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు.

పెన్షన్‌ కూడా రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్‌ అంటూ తన గోడును మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేయడంతో కలెక్టర్‌ అతనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి..అర్ధం కాదా అంటూ మండిపడ్డారు.  పక్కనే ఉన్న డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వైపు చూసి ఏంటిది ? ఇక్కడ నుంచి తీసుకెళ్లండి? అని హుకుం జారీ చేశారు.  విధులకు విఘాతం కల్గించారన్న అభియోగంపై  ఫిర్యాదు చేయాల్సిందిగా డీఆర్‌వోను ఆదేశించారు. అంతే డీఆర్‌వో ఆదేశాల మేరకు కలెక్టరేట్‌ బీట్‌ చూసే పోలీసు సిబ్బంది రిటైర్డ్‌ డీటీ విజయకుమార్‌ను బలవంతంగా అక్కడ నుంచి మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌కు  తీసుకెళ్లారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు మహారాణిపేట పోలీసులు రిటైర్డ్‌ డీటీ పై సెక్షన్‌ 186, సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. గోడు చెప్పుకుంటే కేసులు పెడతారా? అంటూ విజయకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్యను కొత్త కలెక్టర్‌ అయినా పరిష్కరిస్తారని వస్తే  తనపై  కేసులు పెట్టిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు