అ(ప)ప్పు శనగ..!

20 Jan, 2015 02:00 IST|Sakshi
అ(ప)ప్పు శనగ..!

కడప అగ్రికల్చర్...: పెరిగిన పెట్టుబడులు... తగ్గిన దిగుబడులు. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు.. మరోపక్క చిరుజల్లులు వెరసి రబీ పంటలు అన్నదాతకు అప్పులు మిగిల్చారుు. జిల్లాలో ముఖ్యంగా రబీ పంటలు వేసిన పడమటి మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రబీలో అత్యధికంగా సాగు చేసిన పప్పుశనగ (బుడ్డశనగ) పంట... రైతన్న కోలుకోలేని దెబ్బతీసింది. పైరు ఎదుగుదల దశలో వరుణుడు కరుణంచకపోవడం, పూత, పిందెదశలో తుపాను ప్రభావం వల్ల చిరుజల్లులు కురవడంతో పెద్ద నష్టమే జరిగింది.

చిరుజల్లులతో పంట దిగుబడిని పెంచే పులుసు పదార్థం కారిపోరుు కాపు పూర్తిగా తగ్గిపోరుుంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడం బాధాకరం. కౌలు రైతు పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉంటోంది. సాధారణంగా ఖరీఫ్ పంటలు దెబ్బతీసినా రబీ మాత్రం రైతన్నకు అనుకూలించి ఎంతో కొంత ఆదాయాన్నిచ్చేది.

అయితే ఈ ఏడు ఖరీఫ్‌లో తీవ్రవర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతన్న కుంగిపోయాడు. రబీ సీజను ప్రారంభంలో వర్షాలు ఊరించడంతో ప్రధానంగా పప్పుశనగ(బుడ్డశనగ)తో పాటు జొన్న, పెసర మినుము, పొద్దుతిరుగుడు, ఉలవ, అనప తదితర పంటలు సాగుచేశారు. రబీ పప్పుశనగతో ఖరీఫ్ నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది.   

63972 హెక్టార్లలో సాగు....:
ఈ రబీలో జిల్లాలో 63972 హెక్టార్లలో బుడ్డశనగను సాగు చేశారు. వర్షాభావం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నష్టపోయిన పప్పుశనగ రైతుకు బీమా అందించి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంట సాగు సమయంలో క్వింటా విత్తన ధర రూ. 3500 పలికిందని, అదే నేడు అరకొరగా వచ్చిన పంటకు క్వింటా ధర రూ. 3000 మించి పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడి కూడా గిట్టని వైనం...:
సాధారణంగా బుడ్డశనగ ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఎకరాకు 1 నుంచి 1 1/2 బస్తాలకు మించి రాలేదని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు పంటను పూర్తిగా గొర్రెలకు మేతగా వదిలేశారు. మరి కొందరు అదే పొలంలోనే దున్నేస్తున్నారు. పొలాలను కౌలుకు తీసుకుని బుడ్డశనగను సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంట సాగుకు ముందుగనే భూ యజమానికి ఎకరానికి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు చెల్లించారు. తీరా పంట దెబ్బతినడంతో ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు...:
బుడ్డశనగ పంటను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నాం. కానీ ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు. పంట సాగుకు పదునుపాటి వర్షాలు కురిశాయి. ఇబ్బంది లేదు అని సాగు చేస్తే తీరా పంట బుడ్డలు వచ్చేటప్పుడు చిరుజల్లులు పడడంతో పంట మొత్తం పోయింది. పెట్టుబడులు కూడా రాకుండా పోయినాయి.
 -నారాయణరెడ్డి, శనగరైతు, పెద్దపసుపుల గ్రామం, పెద్దముడియం మండలం.
 
రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి
రబీలో ప్రధాన పంటగా జిల్లా అధిక మండలాల్లో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పోయింది. రబీ కూడా దెబ్బతీసింది. బుడ్డశనగ పంటతోపాటు ఇతర పంటలు కొన్ని మండలాల్లో వర్షాభావంతోను, జిల్లాలోని మరికొన్ని మండలాల్లో  తుపాను ప్రభావంతో చిరుజల్లులు కురవడంతో శనగ కు దిఉబడినిచ్చే పులుసు పదార్థం కారిపోవండంతో దిగుబడి తీర్మానంగా పోయింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
 -రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం.
 
ఇన్‌పుట్ సబ్సిడీ...బీమా అందించాలి...:
ఖరీఫ్ పంటలు వర్షాభావంతో పంటలు తుడిచిపెట్టుకుపోగా, ఆదుకుంటాయనుకున్న రబీ సీజన్ పంటలు కూడా ఏ మాత్రం రైతుకు మేలు చేయలేకపోయాయి. ఈ తరుణంలో రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీతోపాటు పంటల బీమా కూడా అందించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.
 -సంబటూరు ప్రసాదరెడ్డి,
 జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం

మరిన్ని వార్తలు