మళ్లీ ‘కృష్ణా’కు వరద ప్రవాహం

4 Sep, 2019 04:19 IST|Sakshi

తెలంగాణలో వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి మళ్లీ ప్రవాహం 

పది గేట్లు ఎత్తి 12,491 క్యూసెక్కులు సముద్రంలోకి..

ఇన్‌ఫ్లో 31,135..ఔట్‌ఫ్లో 32,491 క్యూసెక్కులు 

పశ్చిమ కనుమల్లోనూ వర్షాలతో ‘కృష్ణా’ ఎగువన పెరిగిన వరద 

ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా.. తెలంగాణలోని పాత నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, వైరా తదితర వాగులు వంకలు పోటెత్తి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 31,135 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి (3.07 టీఎంసీలు) చేరుకోవడంతో.. కృష్ణా డెల్టాకు 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,491 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజి పది గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు.. పశ్చిమ కనుమల్లో కూడా సోమవారం వర్షాలు కురవడంతో ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.

ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండలుగా మారడంతో.. కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి మంగళవారం 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఉజ్జయిని, తుంగభద్ర నదుల్లో వరద పెరగడంతో కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి మంగళవారం 2,85,111 క్యూసెక్కులు రాగా కాలువలకు 14,300 క్యూసెక్కులు విడుదల చేసి, మిగిలిన నీటినిసముద్రంలోకి వదులుతున్నారు. 

మరిన్ని వార్తలు