సింగిల్‌ క్లిక్‌తో జిల్లా సమాచారం

19 Jul, 2019 10:52 IST|Sakshi

అందుబాటులోకి ప్రకాశం వెబ్‌సైట్‌

‘ప్రకాశం డాట్‌ ఎన్‌ఐసీ డాట్‌ ఇన్‌’ రూపకల్పన 

జిల్లాకు ప్రత్యేకంగా నోడల్‌ వ్యవస్థ

ప్రయోగాత్మకంగా లావాదేవీల నిర్వహణ

ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం

సాక్షి, ఒంగోలు సిటీ: హైస్పీడ్‌ ఇంటర్నెట్, ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ వచ్చాక ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది. ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. ప్రస్తుతం ఏ వయస్సు వారైనా అంతర్జాల సేవలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్షణ..క్షణం జిల్లా సమగ్ర స్వరూపాన్ని కూడా పౌరులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా జిల్లా మొత్తంగా సమాచారాన్ని పౌరుల ముందుకు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో చకచకా పనులు జరుగుతున్నాయి. ఇందుకు నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (నిక్‌నెట్‌) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జిల్లాకు సంబంధించి ఎవరికి ఎలాంటి సమాచారం కావాలన్నా ఇట్టే పొందే రోజు అతి దగ్గరలోనే ఉంది.

పూర్వపు రోజుల్లో జిల్లా సమగ్ర సమాచారాన్ని జిల్లా ముఖ్య ప్రణాళికా విభాగం పుస్తక రూపంలో ఏటా అందుబాటులోకి తెచ్చేది. గణాంకాధికారులు ఆ శాఖ పరిధిలో ఉన్నందున సమగ్ర సమాచారాన్ని సేకరించి పుస్తకం ముద్రించే వారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ సమాచార పుస్తకం (హ్యాండ్‌ బుక్‌) ముద్రణకు నిధులిచ్చేవారు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ పుస్తకం ముద్రణకు నిధులు సమకూర్చడం లేదు. 2010 తర్వాత ఒకటీరెండు పుస్తకాలు మినహా హ్యాండ్‌ బుక్‌ అందుబాటులో లేకుండా పోయింది. జిల్లా అధికారులకు హ్యాండ్‌ బుక్‌ కావాలంటే ప్రణాళికా అధికారులు జెరాక్సు ప్రతులతో సమకూరుస్తున్నారు.

రానురానూ జెరాక్స్‌ పుస్తకాలు కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని పౌరులకు వివిధ అంశాలపై సమాచారం కావాల్సి వచ్చినప్పుడు, పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థుల నుంచి హ్యాండ్‌ బుక్‌ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ప్రకాశం జిల్లా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ప్రకాశం వెబ్‌సైట్‌ను సక్రమంగా నిర్వహించలేకపోయింది. దీంతో ఆ వెబ్‌సైట్‌ ఆరంభ శూరత్వంగానే మిగిలింది. తాజాగా పౌరుల నుంచి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది.

ఆగస్టు 15న ప్రారంభానికి సిద్ధం...
ప్రకాశం వెబ్‌సైట్‌ను ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ నేతృత్వంలో నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అధికారులు అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రకాశం వెబ్‌సైట్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడు చేయడానికి ఒక నోడల్‌ అధికారిని నియమించనున్నారు. నోడల్‌ అధికారి అన్ని శాఖల అధికారులు, వివిధ రంగాలలోని వారిని, ముఖ్య ప్రణాళికా విభాగం అధికారులు, ఇతర సమాచార సేకరణ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని ఈ వ్యవస్థను నిర్వహించనున్నారు. పొరుగు సేవల నుంచి కొందరు ఉద్యోగులను ఈ విభాగంలో నియమించుకునే అవకాశం ఉంది. ప్రకాశం వెబ్‌సైట్‌ నిర్వహణకు నిధుల కేటాయింపునకు కూడా చర్యలు తీసుకోనున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా కలెక్టర్‌ నిర్ణయించారు. 

ఎలాంటి సమాచారం ఉంటుందంటే...
జిల్లాలో ఏ రంగం నుంచైనా ఎలాంటి సమాచారమైనా లభించేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేశారు. ‘ప్రకాశం డాట్‌ ఎన్‌ఐసీ డాట్‌ ఇన్‌’ వెబ్‌సైట్‌ చిరునామాను క్లిక్‌ చేస్తే చాలు.. అందులోని సమాచార వర్గీకరణను అనుసరించి ఆయా రంగాన్ని ఎంచుకుంటే పూర్తి సమాచారం లభించేలా రూపకల్పన చేశారు. ప్రకాశం జిల్లా చరిత్రకు సంబంధించి జిల్లా ఏర్పడినప్పటి నుంచి పూర్తి వివరాలను పొందుపరుస్తారు. జిల్లా విస్తీర్ణం, పురుషులు, మహిళలు, డివిజన్లు, ప్రజాప్రతినిధులు, లోక్‌సభ, అసెంబ్లీ స్వరూపాలు, పంచాయతీలు, ఓటర్లు ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 1901 నుంచి జనాభా పెరుగుదల, పట్టణాలు, నగరాల్లో జనాభా వివరాలు, గృహస్తులు, మండలాల వారీగా జనాభా వివరాలు ఉంటాయి. ఆరోగ్య రంగంలో ఉన్న సంస్థలు, వైద్యసేవలు, బడ్జెట్, ఆస్పత్రులు, ఉపకేంద్రాలు, సబ్‌ సెంటర్ల చిరునామాలను అందుబాటులో ఉంచుతారు.

నేర విభాగం పరిధిలోని కేసులు, సమాచార హక్కు చట్టం కింద వివరాలు, క్రైం బ్యూరో రికార్డులు, పాత కేసులు, న్యాయశాఖకు సంబంధించిన సమాచారం, పోలీసుస్టేషన్ల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంటాయి. వ్యవసాయం, నీటిపారుదల రంగం, పర్యాటక రంగం, పశుసంవర్థక శాఖ వివరాలు, మత్స్య సంపద, అటవీ విస్తీర్ణం, ఇతర వివరాలు, పరిశ్రమలు, రవాణా, గనులు, విద్యుత్, పబ్లిక్‌ ఫైనాన్స్‌ ఇతర వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. వివిధ వస్తువుల ధరలను కూడా పొందుపరుస్తారు. ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు, విద్యారంగ సమాచారం, స్థానిక సంస్థల సమాచారం, స్త్రీశిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం ప్రభుత్వ కార్యకలాపాలు, జిల్లాకు సంబంధించి విడుదలయ్యే గెజిట్లు, ఎన్నికల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరుస్తారు. ఇవే కాకుండా జిల్లాలో గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆ గ్రామ పరిధిలో సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందించాలన్నదే లక్ష్యంగా ప్రకాశం వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. 

కొలిక్కి వచ్చిన సమాచార సేకరణ...
జిల్లాలో వివిధ రంగాల నుంచి సమాచారాన్ని మూడొంతుల వరకు ఇప్పటికే సేకరించారు. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించడానికి నిత్యం సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుండాలి. బహుముఖంగా సమాచారాన్ని సేకరిస్తేనే ఈ వెబ్‌సైట్‌ విజయవంతమవుతుంది. గత ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించిందిగానీ, అనంతరం పట్టించుకోలేదు. కలెక్టర్, అధికారులు ప్రారంభం నాడు ఇచ్చిన ప్రాధాన్యతను ఆ తర్వాత వెబ్‌సైట్‌ నిర్వహణకు ఇవ్వలేదు. దీంతో వెబ్‌సైట్‌ క్రమేణా నిలిచిపోయింది. గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకుండా నోడల్‌ అధికారిని నియమించేందుకు ఈసారి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సమాచార సేకరణ కొలిక్కి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఈ వెబ్‌ పరిధిలోకి తెస్తున్నారు. రెండు మూడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రకాశం వెబ్‌సైట్‌ ప్రారంభానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రయోగాత్మకంగా ఈ వెబ్‌సైట్‌ లావాదేవీలు మొదలయ్యాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. న్యూస్, చిత్రపటాలు, జిల్లా ముఖ్య పర్యాటక కేంద్రాల వివరాలు, వీడియోలు, షాపింగ్‌ వివరాలు, విపణి, ఇతర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కలెక్టర్‌ కార్యాలయం, పరిపాలనా కేంద్రాల్లో జరిగే లావాదేవీలను ఈ వెబ్‌సైట్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు