రా‘మాయ’పట్నమేనా..!

15 Jul, 2019 12:27 IST|Sakshi
పోర్టు భూమి పూజ శిలాఫలకం

ప్రశ్నార్థకంగా రామాయపట్నం పోర్టు

ఎన్నికల కోసం గత టీడీపీ ప్రభుత్వం భూమి పూజ

శాసనసభలో చర్చకురానున్న పోర్టు సమస్య

సాక్షి, ఉలవపాడు: రామాయపట్నం పోర్టు.. జిల్లా వాసుల కల.. కానీ ఈ కలను నెరవేర్చడం సంగతి పక్కనపెడితే రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయంకు గురిచేసిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ పోర్టుకు సంబంధించిన నిర్ణయాలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయని తెలిసి జనవరి 9న హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుంది అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు.

రెండు నెలల్లో  పోర్టు పనులు ప్రారంభం అవుతాయి అని ఆ రోజు బహిరంగ సభలో చెప్పారు. ఆ తరువాత ఆ విషయమే పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానం కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికల సమయంలో బాబు చేసిన ఈ భూమిపూజ ప్రభుత్వ అనుమతులతో జరిగిందా లేక పబ్లిసిటీ కోసం చేశారా అనే అయోమయంలో జిల్లా ప్రజలున్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు గత పదేళ్లుగా అధికార, ప్రజాప్రతినిధుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయి అని గత ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో నేటి వరకు ఆ ఊసేలేదు. కనీసం రెవెన్యూ అధికారులు సర్వే కూడా ప్రారంభించలేదు.

సర్వే లేకుండా, భూ సేకరణచేయకుండా, పరిహారం గురించి నిర్ణయం తీసుకోకుండా గత ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడిగా భూమిపూజ చేసింది తప్ప పనులు చేయాలన్న ఉద్దేశమే లేదని ప్రజలకు అర్థమైపోయింది. కానీ పోర్టు నిర్మాణం అయోమయాలకు గురి చేస్తున్న పరిస్థితుల్లో నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఈ శాసన సభ సమావేశాల్లో రామాయపట్నం పోర్టుపై ప్రశ్నించనున్నారు.

వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేసి నియోజకవర్గ అభివృద్ధికి పోర్టు ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 2012 జనవరి నుంచి పోర్టు కోసం పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. పోర్టు నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక బృందంను పరిశీలనకు పంపింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మహీధరరెడ్డి, నాటి కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే వారికి పరిస్థితిని వివరించారు. వారు ఈ ప్రాంతం అనువుగా ఉందని కూడా తెలిపారు. కానీ తదనంతర పరిణామాలు ప్రకాశం జిల్లా వాసులను ఇబ్బందులకు గురిచేశాయి. దుగ్గరాజుపట్నంకు తరలింపు, తరువాత అక్కడ అనుమతులు లేక నిలుపుదల, ఇక్కడ చిన్నపోర్టు అని ప్రకటన, రాష్ట్రం లేఖ ఇవ్వలేదని కేంద్రం చెప్పడం, కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రమే నిర్మిస్తుందని భూమి పూజ చేయడం.. ఇలా అంతా అయోమయంగా నడిచింది.

అనుమతులు ఉండే భూమి పూజ చేశారా...?
ఈ ఏడాది జనవరి 9న గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామాయపట్నం వద్ద  పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసింది. కానీ ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోర్టు నిర్మించాలంటే ముందుగా కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నుంచి అనుమతులు రావాలి. ఈ పోర్టు పరిధిలో అటవీశాఖ భూమి ఉంది కాబట్టి అటవీశాఖ నుంచి అనుమతులు రావాలి. ప్రారంభ సమయానికి ఇలాంటి అనుమతులు ఏమీ లేకుండానే భూమి పూజ చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు కు కేంద్రం సుముఖతగా ఉన్నా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వకుండా తామే భూమి పూజ చేసి నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన ఈ ప్రక్రియ వలన ఉపయోగం ఉందా అనే ఆలోచనలో ప్రజలున్నారు. 

మరిన్ని వార్తలు