చెట్ల కింద చదువులు

30 Jan, 2020 12:19 IST|Sakshi
విద్యార్థులకు చెట్ల కింద తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుడు 

సాక్షి, ఒంగోలు టౌన్‌: చెట్ల కింద చదువులు..ఈ మాట వినేందుకే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ ఆ మాట వినాల్సి వచ్చినా అదేదో మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలై ఉంటుందిలే అని లైట్‌గా తీసుకుంటారు. ఆ చెట్ల కింద చదువులు జిల్లా కేంద్రంలోని పాఠశాల అయితే? ఆ పాఠశాల కూడా కలెక్టరేట్‌కు కొద్ది దూరంలో ఉండేది అయితే? ఊహించుకునేందుకు కష్టమైనప్పటికీ ఇది నిజమే. ఒంగోలు అగ్రహారం రోడ్డులోని బాలాజీనగర్‌ మునిసిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు నెలల నుంచి అక్కడి విద్యార్థులు చెట్ల సాక్షిగా వాటి కిందనే చదువుకుంటున్నారు. మరికొన్ని తరగతులను కారిడార్‌ కింద నిర్వహించుకోవాల్సి వస్తోంది. ఆ పాఠశాలకు విశాలమైన స్థలం ఉన్నా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదనపు తరగతి గదులు నిర్మించక పోవడంతో ప్రస్తుతం అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది. మిగిలిన మునిసిపల్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులంతా చక్కగా తరగతి గదుల్లో బల్లలపై కూర్చొని చదువుకుంటుంటే, ఇక్కడి విద్యార్థులు మాత్రం తమ తలరాత ఇంతేనా అన్నట్లుగా చెట్ల కింద చదువుకుంటూ ఎండ పడుతుంటే అటూ ఇటూ జరుగుతూ అవస్థలతో పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

ఇదీ..జరిగింది 
బాలాజీనగర్‌ మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలను 1981లో ప్రారంభించారు. మొదట్లో చిన్న రేకుల షెడ్లు వేసి ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. 1985వ సంవత్సరంలో బిల్డింగ్‌ నిర్మించారు. అందులో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత మరికొన్ని గదులు నిర్మించారు. 1985లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకున్న ప్రతిసారీ ప్యాచ్‌ వర్కులతో సరిపుచ్చుతూ వస్తున్నారు. శ్లాబ్‌ పెచ్చులు ఊడటం, వర్షాకాలంలో విద్యార్థులు భయం భయంగా తరగతి గదుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో శ్లాబ్‌కు ప్యాచ్‌ వర్కులు చేసే సమయంలో రెండు లేయర్లు బయటకు వచ్చాయంటే ఆ భవన స్థితిగతులను అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో తరగతి గదులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శిథిలస్థితికి చేరిన భవనంలోనే ఒకటి, రెండు, మూడు, ఐదు తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో అప్పుడు కురిసిన వర్షాలకు భవనానికి సంబంధించి పోర్టు పోలియో పెద్ద శబ్ధం చేస్తూ పడిపోయింది. పోర్టు పోలియో పడిపోయిన ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు తన మోటర్‌ బైక్‌ పెట్టడంతో అంతకు ముందు రోజు వరకు అదే ప్రాంతంలో స్టడీ అవర్స్‌కు విద్యార్థులు అక్కడే కూర్చొని చదువుకునేవారు. అక్కడ మోటర్‌ బైక్‌ ఉండటంతో అదృష్టవశాత్తు విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  

ఆ పాఠశాల దెబ్బకు  ప్రైవేట్‌ పాఠశాలలు పరార్‌ 
బాలాజీనగర్‌ మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలకు ఆ చుట్టుపక్కల మంచి పేరు ఉంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుల కమిట్‌మెంట్‌ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడి విద్యాబోధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మర్‌ క్లాస్‌లు, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ దెబ్బకు ప్రైవేట్‌ పాఠశాలలను పెట్టినవారు చివరకు వాటిని మూసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై తీసుకునే శ్రద్ధతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడి ఉపాధ్యాయులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తమ పాఠశాలను ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయించుకోవడం జరిగింది.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అక్కడ 299 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతికి సంబంధించి రెండు సెక్షన్లు, ఐదో తరగతికి సంబంధించి రెండు సెక్షన్లు అక్కడ నిర్వహిస్తున్నారు. పాఠశాలలోని చెట్ల కింద చదువుకుంటున్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు చలించిపోతున్నారు. వెంటనే తరగతి గదులు నిర్మించాలని కోరుతున్నారు. తరగతి గదులు నిర్మించకుండా చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తే వచ్చే విద్యా సంవత్సరం తమ పిల్లలను పంపమని విద్యార్థుల తల్లిదండ్రులు కరాఖండిగా చెబుతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.  

అదనపు తరగతి గదులు నిర్మించాలి 
తల్లిదండ్రుల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న బాలాజీనగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు విశాలమైన స్థలం ఉంది. ఒకవేళ నిధుల కొరత ఉంటే ప్రస్తుతం ఉన్న ఆఫీసు రూమ్‌పైన, డిజిటల్‌ లైబ్రరీపైన రెండు చొప్పున అదనపు తరగతి గదులు నిర్మించుకునే వెసులుబాటు ఉంది. ఒకదానిపై మరొకటి నిర్మించడంతో నిర్మాణ ఖర్చు కూడా కొంతమేర తగ్గుతోంది. నగర పాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి బాలాజీనగర్‌ మునిసిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నాడు–నేడులో భాగంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ ఈ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేరంట్స్‌ కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు