హెరిటేజ్‌ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య

11 Feb, 2019 10:59 IST|Sakshi
హరిబాబు రాసిన సూసైడ్‌ నోట్‌.. హరిబాబు, నారా భువనేశ్వరి(ఫైల్‌)

సాక్షి, దర్శిటౌన్‌: హెరిటేజ్‌ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కంపెనీ తనను అకారణంగా తొలగించడంతోనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు(48) 2012లో హెరిటేజ్‌కు చెందిన పాలు, సంబంధిత పదార్థాల సీ అండ్‌ ఎఫ్‌ (కారీయింగ్‌ అండ్‌ ఫార్వార్డింగ్‌) డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు. రూ.2.8 లక్షలు కూడా డిపాజిట్‌ చేశాడు.

ఒంగోలు నగరంలో ఉంటున్న ఆయన.. కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదనంగా డిపాజిట్‌ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్టు హరిబాబుకు జనవరి 5న కంపెనీ నుంచి మెయిల్‌ అందింది. కంపెనీ పెద్దలను బతిమాలుకున్నా ఫలితం లేకపోవడంతో మర్నాడే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు లేఖ రాశాడు. తనను ఆపేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడతానని లెటర్‌లో వేడుకున్నాడు. ఇతర కంపెనీలతో పోల్చితే హెరిటేజ్‌లో తక్కువప్రోత్సాహకం ఇస్తున్నా టీడీపీపై అభిమానంతోనే పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆ ఉత్తరానికి కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

బకాయిలు ఆగిపోవటం, డిపాజిట్‌ వెనక్కు ఇవ్వకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నానని, ఆత్మహత్యే శరణ్యమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ తనను తీసేయడంతో అప్పుల పాలై చివరికి తన 3.5 ఎకరాల పొలం అమ్మి కొంతమేర బాకీలు తీర్చాడు. ఈ నేపథ్యంలో శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు అద్దంకిలోని ఆస్పత్రికి తరలించగా> అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. 

మరిన్ని వార్తలు