వెలిగొండతోనే ప్రకాశం    

24 Jun, 2019 10:10 IST|Sakshi

నేడు విజయవాడలో కలెక్టర్ల సదస్సు

హాజరు కానున్న జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 

సాక్షి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తుందని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. ప్రాజెక్టుతో ప్రధానంగా సాగు, తాగునీటి ఇబ్బందులు తీరతాయని, తద్వారా పరిశ్రమలు తరలివచ్చే అవకాశముందని ఆయన ప్రభుత్వానికి నివేదించనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సోమవారం విజయవాడలో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు పోలా భాస్కర్‌ హాజరుకానున్నారు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేసిన ఆయన సోమవారం ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తితోనే ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నాటికి ఫేజ్‌–1 పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామన్నారు. ఆ మేరకు ఇప్పటికే సీఎం జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్‌ ఫేజ్‌–1 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. వెలిగొండ పరిధిలో ప్యాకేజీకి సంబంధించి రూ.450 కోట్లు, భూసేకరణకు రూ.240 కోట్లు, సాగర్‌ పరిధిలో 132 కేవీ విద్యుత్‌లైన్‌ రీలొకేట్‌ చేసేందుకు రూ.304 కోట్లు, ఇన్‌ప్రాస్టక్చర్, గృహాల నిర్మాణానికి కలిపి రూ.450 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించనున్నారు.

దీంతో పాటుగా టన్నెల్‌–1 నిర్మాణానికి రూ.250 కోట్లు, హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు, ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌కు రూ.130 కోట్లు చొప్పున రూ.450 కోట్లు అవసరమని ఇరిగేషన్‌ అధికారులు నివేదించారు. ఈ నిధులతో 8 లేఅవుట్‌ కాలనీల నిర్మాణం చేసి  నీటిని విడుదల చేసే లోపు పూర్తి చేయాల్సివుంది. వెలిగొండ పూర్తయితే జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందుతుందని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వెలిగొండ నీళ్లు వస్తే కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక వాడలు పూర్తి చేయవచ్చన్నారు. రూ.56 కోట్లు కేటాయిస్తే ఏపీఐఐసీ ద్వారా నిమ్జ్‌కు భూసేకరణ పూర్తి అవుతుందన్నారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు  లభిస్తాయన్నారు.

కరువుసాయం రూ.398 కోట్లు..
జిల్లాకు కరువు సాయం రూ.398 కోట్లు రావాల్సి ఉందని దానిని వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రధానంగా గ్రామీణ తాగునీటి రంగానికి సంబంధించి రూ.66 కోట్లు, పట్టణ తాగునీటికి సంబంధించి రూ.31.73 కోట్లు, వ్యవసాయరంగానికి సంబంధించి రూ.236 కోట్లు, పశుసంవర్దక శాఖకు సంబంధించి రూ.57.38 కోట్లు చొప్పున గత ఏడాధి రెండు సీజన్లకు సంబంధించిన పరిహారం రావాల్సి ఉందని, ఇది రిలీజ్‌ చేయాలని కలెక్టర్‌ ప్రభుత్వానికి  నివేదించనున్నారు.

సాగర్‌ ఆధునీకరణ నిధులు కోసం..
గతంలో నాగార్జున సాగర్‌ కుడికాలువ ఆధునీకరణ పనులు రూ.73.69 కోట్లతో చేపట్టారని 47 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని మిగిలి ఉన్న 53 శాతం పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్‌కు చివరి ఆయకట్టుకు నీటిని ఇవ్వవచ్చని కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. రూ.47 కోట్లు నిధులు ఇస్తే మిగిలిన పనులు పూరి చేస్తామన్నారు.
జిల్లాలో ట్రిపుల్‌ ఐటీకి భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కలెక్టర్‌ నివేదించారు.

ఈ ఏడాది ఒంగోలులోనే తాత్కాలిక భవనంలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు భోదన నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు. యూనివర్సిటీకి సైతం భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అవసరమై నిధులు కేటాయిస్తుందన్నారు. వీటితో పాటు కలెక్టర్ల సదస్సులో గ్రామ సచివాలచ ఏర్పాటు, పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల నియామకాలు, పౌరసరఫరాల శాఖ ద్వారా సక్రమంగా నిత్యావసర సరుకుల పంపిణీ, అమ్మఒడి, పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సర్వశిక్షా అభియాన్‌ ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పెన్షన్లు తదితర అంశాలను సీఎం కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. 

>
మరిన్ని వార్తలు