ప్రకాశం పోలీస్‌కు మరోసారి స్కాచ్‌ అవార్డు

27 Nov, 2019 08:38 IST|Sakshi

వరుసగా రెండో ఏడాదీ దక్కిన గౌరవం

29న ఢిల్లీలో అందుకోనున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

సాక్షి, ఒంగోలు: ప్రకాశం పోలీస్‌శాఖ మరోమారు స్కాచ్‌ అవార్డుకు ఎంపికైంది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డును దక్కించుకుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘ప్రాజెక్టు జియో’ ఇందుకు ఎంపికైంది. ప్రభుత్వ విభాగాలలో ప్రస్తుతం నడుస్తున్న విధానం కంటే వినూత్నంగా.. సమాజానికి మరింత మేలు కలిగేదిగా ఎవరైనా సాంకేతికతను ఉపయోగించుకుని 60 అంశాలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. జాతీయస్థాయిలోని పోలీసు విభాగాలతోపాటు అన్ని రాష్ట్రాలకు చెందిన పోలీసు విభాగాలు దాదాపు వెయ్యికిపైగా దరఖాస్తులను పంపుకున్నాయి. వాటిని స్రూ్కటినీ చేసి దాదాపు 100 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వాటిలో 6 ప్రాజెక్టులు మన రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి.

వీటిలో ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రారంభించిన జియో ప్రాజెక్టు ఒకటికాగా, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ ఆరు జిల్లాల ఎస్పీలు ఈనెల 29న న్యూఢిల్లీలో జరిగే స్కాచ్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి అవార్డులు అందుకోనున్నారు. గతంలో ప్రకాశం జిల్లాకు రెండు స్కాచ్‌ అవార్డులు దక్కాయి. భూసారపు సత్యయేసుబాబు జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఐకాప్‌ ప్రాజెక్టుకు, క్రైం డేటా ఎనలిటిక్స్‌ అనే వాటికి సంబంధించి స్కాచ్‌ అవార్డులు దక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు దక్కడం పట్ల ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు