రాలిన సాహితీ దిగ్గజం

26 Jul, 2015 01:34 IST|Sakshi
రాలిన సాహితీ దిగ్గజం

సాహితీ శిఖరం కరిగిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమ దీప్తి నింగికెగసింది. తన రచనలతో సమాజ మేల్కొలుపునకు అనుక్షణం పరితపించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు కనుమరుగయ్యాడు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) శనివారం విశాఖపట్నంలో కాలం చేశారు. దీంతో ఆయన స్వస్థలం పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు కన్నీటిసంద్రమైంది.
 
- చలసాని ప్రసాద్ మృతితో విషాదంలో భట్లపెనుమర్రు
- చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు వాదే
- విరసం స్థాపనలో కీలక పాత్ర
మచిలీపట్నం/కూచిపూడి :
జిల్లా సాహితీ దిగ్గజాన్ని కోల్పోయింది. కమ్యూనిస్టు భావాలను అణువణువునా నింపుకొని శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రచనలు మరుగున పడకుండా వాటిని వెలుగులోకి తెచ్చిన సాహితీవేత్త, ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) మరణించారనే విషయం తెలుసుకున్న భట్లపెనుమర్రు వాసులు కన్నీటి పర్యంత మయ్యారు. మొవ్వ మండలంలో భట్లపెనుమర్రుకు చెందిన బసవయ్య, వెంకట నరసమ్మలకు 1932 డిసెంబరు 8వ తేదీన ప్రసాద్ జన్మించారు.

చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాన్ని అతి దగ్గర నుంచి చూసిన ఆయన కమ్యూనిజం వైపే పయనించారని గ్రామస్తులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం లో అన్న, బావ, పినతండ్రిని చలసాని కోల్పోయారని చెబుతున్నారు. హైస్కూల్ వరకు భట్లపెనుమర్రులోనే ఆయన చదువుకున్నారని పేర్కొంటున్నారు.
 
విరసం స్థాపనలో చురుకైన పాత్ర...
1970 జూలై 4వ తేదీన విప్లవ రచయితల సంఘం స్థాపనలో ఆయన చురుకైన పాత్ర పోషించారని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. 1964లో సీపీఎంలో పనిచేశారని, 1969లో సీపీఐ (ఎంఎల్)లో ఆయన పనిచేశారని గ్రామస్తులు చెబుతున్నారు. 1986-88 మధ్య విరసం ప్రధాన కార్యదర్శిగా, 1998-2000 మధ్య విరసం అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తరచూ గ్రామానికి వచ్చే ఆయన చిన్న పిల్లల మనస్తత్వంతోనే మాట్లాడే వారని, సమాజానికి, సాహితీలోకానికి తనవంతుగా ఏదో చేయాలని తపన పడేవారని గ్రామపెద్దలు చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలను 20 సంపుటాలలో ముద్రించడానికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొంటున్నారు.

భట్లపెనుమర్రులో పుట్టి సాహితీ లోకానికి ఎనలేని సేవలు అందించిన చలసాని ప్రసాద్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు మననం చేసుకుంటున్నారు. త్రిపురనేని గోపీచంద్ రచనలను పది సంపుటాలుగా వెలువడిన ముద్రణలకు తుమ్మల కృష్ణాబాయితో కలిసి సంపాదకత్వం వహించారని చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలు, విరసం తనకు రెండు కళ్లు అని తరచూ తమతో అనేవారని గ్రామపెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.
 
శ్రీశ్రీ సాహిత్యనిధికి అంకితం ఇచ్చారు
‘చిరంజీవి శ్రీశ్రీ’ అనే పుస్తకాన్ని చలసాని రచించారు. ఈ పుస్తకాన్ని శ్రీశ్రీ సాహిత్యనిధికి ఆయన అంకితం ఇచ్చారు. తన రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలపడానికి చలసాని అనుక్షణం తపించేవారు. కొడవటిగంటి కుటుంబరావు రచనలను ఆరు సంపుటాలుగా ముద్రించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. జిల్లాలో జన్మించి విరసం స్థాపనలో కీలకభూమిక పోషించిన చలసాని సాహితీ లోకానికి చేసిన సేవలకు వెలకట్టలేం.
- సింగంపల్లి అశోక్‌కుమార్, ప్రముఖ రచయిత
 
ప్రసాద్‌ను మరిచిపోలేం
చలసాని ప్రసాద్ మా గ్రామం వాడే. ఏడాది క్రితం గ్రామానికి వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదువుకునే రోజుల్లో చెరువులో ఈదటం, చెట్లు ఎక్కటం వంటి సంఘటనలను మననం చేసుకున్నాం. ప్రసాద్ శ్రీశ్రీకి అనుంగు శిష్యుడిగా ఉండేవారు. శ్రీశ్రీ చివరి దశలో రచించిన సాహిత్యాన్ని సేకరించి ముద్రణకు నోచుకోవడానికి ప్రసాద్ ఎంతగానో కృషి చేశారు. చలసాని ప్రసాద్ అన్న, బావ, పినతండ్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాల్పుల్లో మరణించారు.
- డాక్టర్ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, భట్లపెనుమర్రు, మొవ్వ మండలం
 
పేదలకు సాయం చేయాలని తపించేవారు
చలసాని ప్రసాద్ చిన్నతనం నుంచే ఉద్యమాలను అతి దగ్గర నుంచి చూశారు. పేద వారికి సాయం చేయాలనే తపన ఆయనలో ఉండేది. గ్రామానికి వచ్చిన ప్రతిసారీ మాతో పలు అంశాలపై చర్చించేవారు. కమ్యూనిస్టు భావజాలాన్ని నింపుకొన్న ఆయన చివరి వరకు కమ్యూనిస్టు గానే కొనసాగారు. మా గ్రామానికి చెందిన ప్రసాద్ విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించటంలో కీలక పాత్ర పోషించారని తెలుసుకున్న మేము ఎంతగానో గర్వపడే వాళ్లం. ప్రసాద్ తండ్రి బసవయ్యతో నాకు పరిచయం ఎక్కువ.
- గొట్టిపాటి గోపాలకృష్ణయ్య, భట్లపెనుమర్రు, మొవ్వ మండలం
 
సాహితీలోకానికి తీరని లోటు
అందరం సాహితీవేత్తలమే అయినా ప్రసాద్ ముక్కుసూటిగా మాట్లాడేవారు. చలసాని ప్రసాద్ మరణం సాహితీ లోకానికి తీరనిలోటు. సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
- రావి రంగారావు, సాహితీవేత్త

మరిన్ని వార్తలు