అన్యమతస్తులకు అప్పన్న ప్రసాదం తయారీ కాంట్రాక్ట్‌?

14 Mar, 2018 12:45 IST|Sakshi
కాంట్రాక్టర్‌ దాఖలు చేసిన డిక్లరేషన్‌

హిందువులకే కాంట్రాక్ట్‌ ఇవ్వాలంటున్న నిబంధనలు

కాంట్రాక్ట్‌ పొందిన వారు హిందువు కాదని ఆరోపణలు

విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్న ఈవో

సింహాచలం(పెందుర్తి): వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్‌ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర  విక్రయాలు జరుపుతార న్న సంగతి తెలిసిందే. వీటిని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఏటా దేవస్థానం ఈప్రొక్యూర్‌మెంట్, సీక్రెట్‌ టెండర్‌ ద్వారా ప్రసాదాల కాంట్రాక్ట్‌ను ఇస్తుంటుంది. వీటిల్లో తక్కువ కోడ్‌ చేసిన కాంట్రాక్టర్‌కు ప్రసాదాల కాంట్రాక్ట్‌  ఇస్తుంది. సదరు కాంట్రాక్టర్‌ పులిహోర ప్యాకింగ్, శ్రీ వైష్ణవస్వాములతో లడ్డూను  తయారుచేయించడం, సిబ్బంది చేత లడ్డూలను చుట్టించడం చేయాలి.

దేవాదాయశాఖ రూల్‌ ప్రకారం టెండర్లు వేసి, వాటిని దక్కించుకునే వారంతా హిందువులే అయి ఉండాలి. ఇప్పటివరకు అలాగే కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి  ప్రారంభమైన కొత్త కాంట్రాక్ట్‌కు సంబంధించి దేవస్థానం టెండర్లు పిలిచింది. అందులో ఈప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాజ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ తక్కువ కోడ్‌ చేసి టెండరు కైవసం చేసుకుంది. సంబంధిత సెక్యూరిటీ సర్వీసెస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ టెండరు దాఖలు చేశారు. టెండరు తక్కువ ధరకు కోడ్‌ చేయడంతో అతనికి కాంట్రాక్ట్‌ని దేవస్థానం అధికారికంగా అందజేసింది. ఫిబ్రవరి  నుంచి ఇందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. అయితే  సదరు కాంట్రాక్టర్‌ అన్యమతస్తుడని, ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అతడికి ఎలా అప్పగిస్తారన్న ఆరోపణలు రెండు రోజుల  నుంచి చోటుచేసుకున్నాయి. 

విచారణ చేయిస్తాం
దేవాదాయశాఖ రూల్స్‌ ప్రకారం ప్రసాదాల టెండ రు దాఖలు చేసేవాళ్లు, తీసుకునేవారు హిందువు అయి ఉండాలి. టెండరు రూల్స్‌ ప్రకారం కాంట్రాక్టు పొందిన వ్యక్తి తాను హిందువునని డిక్లరేషన్‌లో పేర్కొన్నాడు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఇలాటి విధులు నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని కొన్నేళ్ల నుంచి అందిస్తున్నట్టు డిక్లరేషన్‌లో తెలిపారు. దేవాదాయశాఖ నిబంధనలకు కట్టుబడి పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నానని, అన్యమతానికి చెందినవాడిని కాదని తెలిపారు. అయినా అతను హిందువో కాదో విచారణ జరిపిస్తాం. అతను అన్యమతస్తుడైతే కాంట్రాక్ట్‌ రద్దు చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం.
–  కె.రామచంద్రమోహన్, ఈవో సింహాచలం దేవస్థానం 

>
మరిన్ని వార్తలు